Dailyhunt
ఐపీఎల్ 2026: ఢిల్లీ బౌలర్ ఎంగిడికి తీవ్ర గాయం.. మైదానంలోకి అంబులెన్స్

ఐపీఎల్ 2026: ఢిల్లీ బౌలర్ ఎంగిడికి తీవ్ర గాయం.. మైదానంలోకి అంబులెన్స్

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ బౌలర్ లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్షర్ పటేల్ వేసిన 2.3వ బంతికి ప్రియాంశ్ ఆర్య క్యాచ్‌ను అందుకునేందుకు మిడ్ ఆఫ్ వైపు వెనక్కి పరిగెత్తాడు. క్యాచ్ అందుకునే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడిపోయాడు. ఈ క్రమంలో ఎంగిడి తల మైదానానికి బలంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మైదానంలోనే కుప్పకూలాడు. ప్లేయర్లు, అంపైర్లు తీవ్ర ఆందోళన గురయ్యారు.

వెంటనే ఫిజియోలు, డాక్టర్లు మైదానంలోకి వచ్చి ఎంగిడిని పరిశీలించారు. అతడు కదలడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో అంబులెన్స్‌ను పిలిపించారు. తొలుత డాక్టర్లకు సహకరించిన ఎంగిడి.. ఆ తర్వాత చలనం లేకుండా ఉండిపోయాడు. తలకు బ్యాండేజ్ వేసి స్ట్రెచర్‌పై అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో మైదానంలో ఆందోళన వాతావరణం నెలకొంది. డేవిడ్ మిల్లర్, స్టబ్స్ వంటి సహచర ప్లేయర్లు షాక్‌కు గురయ్యారు. కోచ్ రికీ పాంటింగ్ కూడా మైదానంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించాడు. దీంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. ఈ మ్యాచ్‌లో ఎంగిడి ఆడే అవకాశాలు అయితే లేవు. అతడి స్థానంలో చమీరా బౌలింగ్‌కు సిద్ధమవుతున్నాడు. క్రికెట్ మైదానంలో ఇలాంటి సంఘటనలు అరుదు.. ఎంగిడి త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

మ్యాచ్ విషయానికొస్తే..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ కింగ్స్‌కు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ భారీ శతకంతో బీభత్సం సృష్టించాడు. 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్సర్లతో ఏకంగా 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్లు నితీశ్ రాణా తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 పరుగులు చేశాడు. ఛేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అదరగొడుతున్నారు. ఈ వార్త రాసే సమయానికి 3.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 75 పరుగులు చేశారు. క్రీజులో ప్రభ్‌సిమ్రన్ సింగ్(40*), ప్రియాంశ్ ఆర్య(31*) ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy