ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగుల్లో ఐపీఎల్ కూడా ఒకటి. ఈ సీజన్ తుది అంకానికి చేరుకుంది. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా.. రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోనుంది. మరి గెలిచిన జట్టుకు ఎంత నగదు బహుమతిగా అందనుందో తెలుసా..
ఏ జట్టుకు ఎంతంటే..?
ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ మొత్తం రూ.46.5 కోట్ల ప్రైజ్ మనీని కేటాయించినట్లు సమాచారం. టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు ట్రోఫీతో పాటు రూ.20 కోట్ల నగదు బహుమతి దక్కుతుంది. రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. క్వాలిఫయర్ 2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్‌లో పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ.6.50 కోట్లు వస్తాయి. ఐదు నుంచి పదో స్థానంలో ఉన్న జట్లకు ప్రైజ్ మనీ అందదు. ఆటగాళ్లకూ వ్యక్తిగతంగా ప్రైజ్ మనీ ఇస్తారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్స్, అత్యంత విలువైన ఆటగాడికి రూ.10 లక్షల చొప్పున ఇస్తారు. ఎమర్జింగ్ ప్లేయర్‌కు రూ.20 లక్షలు అందుతాయి.
గతంలో ఎంత ఇచ్చేవారంటే..?
2008లో ఐపీఎల్ మెగా టోర్నీ ప్రారంభమైంది. అప్పుడు విజేతకు రూ.4.8 కోట్లు ఇచ్చేవారు. తర్వాత సీజన్లలోనూ అంతే మొత్తం వచ్చేది. అయితే 2010 నుంచి 2013 వరకు రూ.10 కోట్లకు పెంచారు. 2014, 2015లో రూ.15 కోట్లు, 2016 నుంచి 2019 వరకు రూ.20 కోట్లు ఐపీఎల్ విజేతకు దక్కింది. కొవిడ్ కారణంగా 2020లో ప్రైజ్ మనీని రూ.10 కోట్లకు తగ్గించారు. ఇక 2021 నుంచి ప్రస్తుత సీజన్ వరకూ రూ.20 కోట్ల చొప్పున ప్రైజ్ మనీని విజేతకు అందిస్తున్నారు.

