Dailyhunt
ఐపీఎల్ 2026: ఘోర ఓటమిలోనూ ఢిల్లీ బ్యాటర్ అరుదైన రికార్డు

ఐపీఎల్ 2026: ఘోర ఓటమిలోనూ ఢిల్లీ బ్యాటర్ అరుదైన రికార్డు

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(సోమవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దారుణ ఆట తీరును ప్రదర్శించింది.

బంతి అనూహ్యంగా బౌన్స్‌, స్వింగ్ అవ్వడంతో 8 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ 6 కీలక వికెట్లు కోల్పోయి.. చివరకు 75 పరుగులకు ఆలౌటైంది. ఇంత చెత్త ఆటలోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో సౌతాఫ్రికా క్రికెటర్‌గా డేవిడ్ మిల్లర్(12,008) నిలిచాడు.11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనత సాధించాడు మిల్లర్.

మిల్లర్ టీ20ల్లో 12వేల పరుగులు పూర్తి చేయడానికి 513 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఇందులో 52 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మిల్లర్ కంటే ముందు క్వింటన్ డికాక్ (12,454 పరుగులు), డుప్లెసిస్ (12,041 పరుగులు) ఈ ఫీట్ అందుకున్నారు. ఓవరాల్‌గా టీ20లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న 13వ బ్యాటర్‌గా మిల్లర్ నిలిచాడు. మిల్లర్ 2012లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 149 మ్యాచ్‌లాడి 3,100 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 14 అర్ధశతకాలు చేశాడు.

అయితే ఈ 14 అర్ధ సెంచరీల్లో 13 హాఫ్ సెంచరీలను మిల్లర్ లక్ష్యఛేదనలో సాధించడం గమనార్హం. క్రిస్ గేల్ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. అతను 463 మ్యాచ్‌లలో 455 ఇన్నింగ్స్‌లలో 36.22 సగటుతో, 144.75 స్ట్రైక్ రేట్‌తో 14,562 పరుగులు సాధించాడు. ఇందులో 22 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 175.

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మిల్లర్ ఏడు మ్యాచ్‌ల్లో 41.00 సగటు, 146.42 స్ట్రైక్ రేట్‌తో 123 పరుగులు చేయగా, అతని అత్యుత్తమ స్కోరు 41*గా ఉంది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ పోరేల్‌ 30 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ 4, భువనేశ్వర్‌ 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో మిల్లర్ 18 బంతుల్లో19 పరుగులు మాత్రమే చేశాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy