ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల ఫైలింగ్ సీజన్ ప్రారంభమైంది. ఉద్యోగులు, ఇండివిడ్యువల్స్.. ఐటీఆర్-1 (సహజ్) ద్వారా, ఆడిట్ అవసరం లేని వృత్తి నిపుణులు, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్న వ్యక్తులు ఐటీఆర్-4 (సుగమ్) తో ఆదాయ పన్ను శాఖ 'ఈ ఫైలింగ్' పోర్టల్ ద్వారా తమ ఐటీ రిటర్నులు ఫైల్ చేయాలి.
అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) 2026-27కి సంబంధించి పన్ను మినహాయింపు పరిమితులు, పాన్‌తో ముడిపడి ఉన్న లావాదేవీలు, ట్యాక్స్ డిడక్షన్లు, టీడీఎస్ పరిమితులు, పెనాల్టీల రూల్స్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. తమ ఐటీ రిటర్నులు దాఖలు చేసే ముందే ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు, మదుపరులు ప్రధానంగా వచ్చిన మార్పులను అర్థం చేసుకోవాలి. లేకపోతే అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ కింది మార్పులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పన్ను మినహాయింపు పరిమితులు
పాత ట్యాక్స్ విధానంలో తమ ఐటీ రిటర్నులు ఫైల్ చేసే వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (ఏఓపీలు), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీఓఐ)ల వార్షికాదాయంలో రూ.2.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
60 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు ఉన్న రెసిడెంట్ సీనియర్ సిటిజన్లకు వారి వార్షికాదాయంలో రూ.3 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు లభిస్తుంది.
80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు వారి వార్షికాదాయంలో రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు
అదే కొత్త పన్ను విధానంలో రిటర్నులు ఫైల్ చేస్తే సెక్షన్ 115 బీఏసీ కింద రూ.4 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
స్టాండర్డ్ డిడక్షన్
ఉద్యోగులు, పెన్షనర్లకు పాత పన్ను విధానంలో అయితే రూ.50,000 వరకు, కొత్త పన్ను విధానంలో రూ.75,000 వరకు స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. ఉద్యోగులు కొత్త ట్యాక్స్ విధానానికి మారడాన్ని ప్రోత్సహించేందుకు ఆ విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను ఎక్కువగా అనుమతించారు.
సెక్షన్ 80సీ కింద ఈ కింది పెట్టుబడులు, చెల్లింపులకు చేసే రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఇస్తారు.
పీపీఎఫ్, ఈఎల్‌ఎస్‌ఎస్ పెట్టుబడులు
ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులు
పిల్లల ట్యూషన్ ఫీజులు, గృహ రుణ అసలు చెల్లింపులు
'పాన్' ఎప్పుడు తప్పనిసరి?
బ్లాక్‌మనీకి చెక్ పెట్టేందుకు అధిక విలువ (హైవాల్యూ) కలిగిన లావాదేవీలకు 'పాన్' నంబర్ కోట్ చేయడాన్ని తప్పనిసరి చేశారు.
రూ.10 లక్షలకు మించిన ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు
రూ.50,000 పైబడిన హోటల్, రెస్టారెంట్ల బిల్లులు
రోజువారీ నగదు డిపాజిట్లు రూ.50,000 మించితే
రూ.2 లక్షలకు మించిన వస్తు, సేవల కొనుగోళ్లు
రూ.2 లక్షలకు మించిన విదేశీ ప్రయాణ ఖర్చులు
పెనాల్టీలు
టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ ఆలస్యానికి రోజుకు రూ.200 చొప్పున
అకౌంటింగ్ బుక్స్ నిర్వహణలో విఫలమైతే రూ.25,000
పాన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ కోట్ చేయకపోతే రూ.10,000
రూ.25 లక్షలకు మించి పన్ను ఎగవేస్తే జరిమానాతో పాటు 6 నుంచి ఏడేళ్ల జైలు శిక్ష
2026-27 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి తమ ఐటీ రిటర్నులు ఫైల్ చేసేటప్పుడు.. పన్ను చెల్లింపుదారులు ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. లేకపోతే ఐటీ శాఖ నుంచి అనవసరమైన నోటీసులు, పెనాల్టీలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద
ఎన్‌పీఎస్, అటల్ పెన్షన్ యోజన పథకాల్లో చేసే పెట్టుబడులకు ఏటా రూ.50,000 వరకు
సెక్షన్ 80డీ కింద
వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు.. ఆరోగ్య బీమా, ప్రివెంటివ్ హెల్త్ చెక్‌పల కోసం ఏటా చేసే ఖర్చుల్లో రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు. అయితే ఈ మినహాయింపు కుటుంబ సభ్యుల వయసు, కవరేజీ క్యాటగిరీలను బట్టి ఉంటుంది.
సెక్షన్ 80టీటీబీ కింద
ఈ సెక్షన్ కింద సీనియర్ సిటిజన్లు ఏటా తమ కు వచ్చే వడ్డీ ఆదాయంలో రూ.50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇతర డిడక్షన్లు
అంగ వైకల్య స్థాయిని బట్టి సెక్షన్ 80యూ కింద వ్యక్తులు, తమ వార్షికాదాయంలో రూ.75,000 నుంచి రూ.1.25 లక్షల వరకు డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు
సెక్షన్ 80డీడీ కింద అంగవైకల్యంతో బాధపడే కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చుల్లో రూ.75,000 నుంచి రూ.1.25 లక్షల వరకు
ప్రత్యేక వ్యాధులతో బాధపడే వ్యక్తులు లేదా వారి కుటుంబసభ్యుల కోసం చేసే ఖర్చుల్లో వారి వయసును బట్టి సెక్షన్ 80 డీడీబీ కింద రూ.40,000 నుంచి రూ.లక్ష వరకు
సెక్షన్ 80ఈఈఏ కింద అందుబాటు ధరల గృహ రుణాలపై చెల్లించే వడ్డీపై రూ.1.5 లక్షల వరకు
సెక్షన్ 80ఈఈబీ కింద విద్యుత్ వాహన రుణాలపై చెల్లించే వడ్డీలో ఏటా రూ.1.5 లక్షల వరకు.
ముఖ్యమైన టీడీఎస్ పరిమితులు
సీనియర్ సిటిజన్ల వార్షిక బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.50,000 మించితే
రూ.50,000 కంటే ఎక్కువగా ఉండే వృత్తి నిపుణుల ఫీజులు
రూ.30,000 కంటే ఎక్కువగా ఉండే కాంట్రాక్టర్ల ప్రతి చెల్లింపులు
రూ.50 లక్షల కంటే ఎక్కువగా ఉండే ఆస్తుల కొనుగోళ్లు
ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన పన్ను రూ.10,000 మించితే అడ్వాన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది.
ఆస్తుల నగదు లావాదేవీలపై ఆంక్షలు
ముంబైలో రూ.75 లక్షలు
ఢిల్లీలో రూ.50 లక్షలు
ఇతర మెట్రో నగరాల్లో రూ..25 లక్షలు
చిన్న పట్టణాలు, గ్రామాల్లో అయితే రూ.10 లక్షల వరకు

