Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా మద్దతుపై భారత్ ఆశలు నెరవేరేనా?

అమెరికా మద్దతుపై భారత్ ఆశలు నెరవేరేనా?

న్యూఢిల్లీ : ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత దేశం చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా మద్దతు ప్రశ్నార్థకంగా మారింది. జార్జి డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగాలు భారత దేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటించగా, తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇందుకు సానుకూలంగా ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఐక్య రాజ్య సమితికి అమెరికా రాయబారిగా బైడెన్ నియమించిన లిండా థామస్-గ్రీన్‌ఫీల్డ్ మాటలు స్పష్టంగా లేకపోవడమే దీనికి కారణం.

థామస్ గ్రీన్‌ఫీల్డ్ బుధవారం సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ సమక్షంలో కన్ఫర్మేషన్ హియరింగ్ సందర్భంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఒరెగాన్ సెనేటర్ జెఫ్ మెర్క్‌లీ మాట్లాడుతూ, ''భారత దేశం, జర్మనీ, జపాన్‌లకు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభించాలని భావిస్తున్నారా?'' అని అడిగారు. ఈ ప్రశ్నకు లిండా థామస్ సమాధానం చెప్తూ, ''ఆ దేశాలకు భద్రతా మండలిలో సభ్యత్వం గురించి కొన్ని చర్చలు జరుగుతున్నాయనుకుంటాను, అందుకు కొన్ని బలమైన వాదనలు ఉన్నాయి. అయితే ఆ దేశాల ప్రాంతాల్లోనే వాటిని వ్యతిరేకిస్తూ, తమ ప్రాంతానికి తామే ప్రాతినిధ్యం వహించాలని చెప్తున్న దేశాలు ఉన్నట్లు కూడా నాకు తెలుసు. ఇది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ'' అని పేర్కొన్నారు.

మరొక ప్రశ్నకు సమాధానంగా లిండా మాట్లాడుతూ, ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలకు సానుకూలత వ్యక్తం చేశారు. భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమనే విషయంపై సాధారణ సమ్మతి ఉందన్నారు. ఆ సంస్కరణలు ఏమిటి, వాటిని ఏ విధంగా అమలు చేస్తారు? అనేవాటిని ఇంకా నిర్ణయించవలసి ఉందన్నారు.

లిండా థామస్ 'కాఫీ క్లబ్' గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఇటలీ, పాకిస్థాన్, మెక్సికో, ఈజిప్ట్ వంటి దేశాలను కాఫీ క్లబ్ అంటారు. ఈ దేశాలు భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్‌లకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకూడదని వాదిస్తున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గత ఏడాది తన ఎన్నికల ప్రచారంలో భాగంగా విడుదల చేసిన విధాన పత్రంలో భారత దేశం భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి మద్దతిస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం మన దేశం ఐరాస భద్రతా మండలిలో నాన్ పర్మినెంట్ మెంబర్‌గా ఉంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి వచ్చే ఏడాది చివరి వరకు ఈ సభ్యత్వం ఉంటుంది.

లిండా థామస్ 35 ఏళ్లపాటు ఫారిన్ సర్వీస్‌లో వివిధ పదవులు నిర్వహించారు. తాజాగా ఆమె ఐక్య రాజ్య సమితికి అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. ఇది కేబినెట్ ర్యాంకు పదవి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy