Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో మళ్లీ కరోనా కలకలం

అమెరికాలో మళ్లీ కరోనా కలకలం

  • కొత్త లక్షణాలతో విరుచుకుపడుతున్న వైరస్‌

  • 48 రాష్ట్రాల్లో కేసులు.. 9 రాష్ట్రాల్లో అధికం

వాషింగ్టన్‌, ఆగస్ట్‌ 29: కరోనా వైరస్‌ సమసిపోయిందని ఊపిరి పీల్చుకుంటున్న వేళ..

అమెరికాలో మరోసారి ఈ మహమ్మారి కొత్త లక్షణాలతో పంజా విసురుతోంది. అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) గణాంకాల ప్రకారం.. 48 రాష్ట్రాల్లో కోవిడ్‌ వైరస్‌ కేసులు (కేపీ 3.1.1, కేపీ 3, కేపీ 2, ఎల్‌బీ 1 వేరియంట్లు) పెరుగుతున్నాయి. తొమ్మిది రాష్ట్రాల్లో కేసుల తీవ్రత కాస్త ఎక్కువగా ఉంది.

గతంతో పోల్చితే ఈ వైరస్‌ కారణంగా ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండడం ఊరటనిచ్చే అంశం. జీర్ణకోశ సంబంధిత లక్షణాలతో ఈ సారి కేసులు బయటకు వస్తున్నాయి. వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలతో బాధితులు ఇబ్బంది పడుతున్నట్టు న్యూయార్క్‌లోని ఫోబే పుత్నే మెమోరియల్‌ హాస్పిటల్‌ అత్యవసర సేవల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ జేమ్స్‌ బ్లాక్‌ తెలిపారు. జీర్ణవ్యవస్థలో ఉండే ఏసీఈ2 రిసెప్టర్లపై వైరస్‌ దాడి చేస్తుండడంతో ఈ లక్షణాలు వెలుగు చూస్తున్నాయి.

అలాగే, గొంతులో కోసేస్తున్నంత తీవ్రమైన నొప్పి, మంట ఉంటున్నాయి. వీటితోపాటు తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు కూడా కనిపిస్తున్నాయి. కనుక జీర్ణకోశ సమస్యలతో బాధపడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా, కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జూన్‌ నుంచి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు సీడీసీ డేటా స్పష్టం చేస్తోంది. అయితే, గత వేసవితో పోల్చిచూస్తే ఈ వేసవిలో కొత్త కేసుల సంఖ్య తక్కువగానే ఉందని ఎపిడెమాలజిస్ట్‌ జోడీ గెస్ట్‌ తెలిపారు. అమెరికా వ్యాప్తంగా 10-15శాతం మందికి కరోనా సోకే అవకాశం ఉందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy