Dailyhunt
అమిత్‌షా అత్యంత బలహీన హోం మంత్రి: సూర్జేవాలా

అమిత్‌షా అత్యంత బలహీన హోం మంత్రి: సూర్జేవాలా

న్యూఢిల్లీ: 'రెడ్ ఫోర్ట్‌' వద్ద మంగళవారం చోటుచేసుకున్న ఘటనలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. రెడ్‌ఫోర్ట్‌లోకి దుండగులను అనుమతించిన హోం మంత్రి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాడ్ చేసింది. రెడ్ ఫోర్ట్ వద్ద జరగిన ఘటనను ఇంటెలిజెన్స్ వైఫల్యంగా పేర్కొంది. దేశ రాజధానిలో ఏడాదిలో రెండు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడానికి హోం మంత్రి బాధ్యత వహించాలని ఆ పార్టీ కాంగ్రెస్ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు.

'ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యం. అమిత్‌షాను హోం మంత్రి పదవి నుంచి తక్షణం తొలగించాలి. ఏడాదిలో జరిగిన రెండో హింసాత్మక ఘటన ఇది' అని సూర్జేవాలా అన్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్లను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అమిత్‌షాను పదవి నుంచి తొలగించకుంటే ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ కొమ్ముకాస్తున్నారని అనుకోవాల్సి వస్తుందన్నారు. దుండగులను వదలి రైతులపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. దుండగులను గుర్తించి వారిపై చర్య తీసుకోవడానికి బదులు రైతు నేతలపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం పూర్తిగా హోం మంత్రి వైఫల్యమేనని సూర్జేవాలా అన్నారు.

దీప్ సిద్ధూకు బీజేపీతో సంబంధాలు..

రెడ్ ఫోర్ట్ ఘటనలో ప్రమేయం ఉన్న నటుడు, యాక్టివిస్ట్ దీప్ సిద్ధూకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సూర్జేవాలా అన్నారు. రైతు సంఘాలు, వారి ఆందోళనలను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రలో ఆయన ప్రమేయం ఉందని అర్ధమవుతోందని చెప్పారు. కాగా, రెడ్ ఫోర్ట్‌పై జెండా ఎగురవేసిన బృందానికి దీప్ సిద్ధూ, గ్యాంగ్‌స్టర్ లఖా సిధాన నాయకత్వం వహించినట్టు రైతు సంఘాలు ఆరోపించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy