Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనంతలో 2కోట్ల  ఎర్రచందనం పట్టివేత

అనంతలో 2కోట్ల ఎర్రచందనం పట్టివేత

  • ముగ్గురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌.. కారు సీజ్‌

నార్పల, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడ గ్రామంలో ఎర్రచందనం డంప్‌ను చిత్తూరు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం గుర్తించారు.

గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి జయరాం సహా ముగ్గురిని అరెస్టు చేశారు. జయరాం ఇంటి సమీపంలో నిల్వ చేసిన 109 ఎర్రచందనం దుంగలను స్వాఽధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులకు చెందిన ఒక కారును సీజ్‌ చేశారు. ఎర్రచందనం దుంగలను విక్రయించేందుకు మరో రెండు రోజుల్లో ఈ ముఠా సభ్యులు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడుకు తరలించే ప్రయత్నాల్లో ఉండగా, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు.


  • ఎర్రచందనం దొంగల్ని వదలొద్దు!

  • అటవీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌ ఆదేశాలు

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం చెట్ల నరికివేత, అక్రమ రవాణాలో సూత్రధారులపై ఉక్కుపాదం మోపాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అటవీశాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని, స్మగ్లింగ్‌ ముఠాల వెనుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని సూచించారు. గురువారం అనంతపురం జిల్లాలో రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారి ఆచూకీ తెలుసుకుని, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా 'ఎక్స్‌' వేదికగా పవన్‌ స్పందిస్తూ, అటవీ సంపద పరిరక్షణ చర్యల్లో రాజీ పడేదేలేదని స్పష్టం చేశారు. 'కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 70శాతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ తగ్గింది. ఎర్రచందనం రాష్ట్ర సరిహద్దు దాటకుండా ఉండేందుకు టాస్క్‌ఫోర్స్‌ సాయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. అంతర్రాష్ట్ర యంత్రాగాల సమన్వయంతో అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను ఛేదించే చర్యలను మరింత వేగవంతం చేస్తున్నాం' అని పవన్‌ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy