Dailyhunt
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా ప్లేయర్

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా ప్లేయర్

స్పోర్ట్స్ డెస్క్: సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

అయితే డొమాస్టిక్ క్రికెట్‌లో మాత్రం 'లయన్స్' జట్టు తరపున మాత్రం ఆడడం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఇవాళ(గురువారం) సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

'దక్షిణాఫ్రికా క్రికెట్‌కు అ‍త్యున్నత స్దాయిలో ప్రాతినిథ్యం వహించినందుకు గర్వంగా భావిస్తున్నాను. ప్రోటీస్ జెర్సీ ధరించిన ప్రతిసారీ ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతోంది. ప్రగాఢమైన కృతజ్ఞతా భావంతో నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నా విరమణను ప్రకటిస్తున్నాను. అయితే ప్రోటీస్ క్రికెట్‌కు నా సేవలను అందించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను. నా అంతర్జాతీయ కెరీర్ ముగిసినప్పటికీ, నేను దేశీయ జట్టు అయిన లయన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూనే, కోచింగ్‌లోకి మారుతాను. ఇప్పటి వరకు నా క్రికెట్ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డుకు, నా సహచరులకు, అభిమానులందరికి కృతజ్ఞతలు' అని వాన్‌ డెర్ డస్సెన్ పేర్కొన్నాడు.

2018 అక్టోబర్ 9న డస్సెన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికా తరఫున 71 వన్డేలు, 18 టెస్టులు, 57 టీ20ల్లో ఆడాడు. ముఖ్యంగా వన్డేల్లో ప్రోటీస్‌కు కీలక ప్లేయర్‌గా నిలిచాడు. 2019 జనవరి 19న వన్డే క్రికెట్ లోకి తొలిసారి అడుగుపెట్టాడు. అరంగేట్రంలోనే 90కి పైగా స్కోరు నమోదు చేసిన ఐదవ బ్యాటర్‌గా డస్సెన్ నిలిచాడు. అతడి పేరిట 6 వన్డే సెంచరీలు ఉన్నాయి. 2023, 2019 ప్రపంచకప్‌లలో సౌతాఫ్రికాకు అతడు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో అతడు రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడాడు. మొత్తంగా డస్సెన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 4968 పరుగులు చేశాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy