Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు

అప్పుడు తండ్రి.. ఇప్పుడు తనయుడు

రిగ్గా 16 ఏళ్ల కిందట న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో ఒక తెలుగోడు కాంస్యం పతకం సాధించి, దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాడు. మళ్లీ ఇప్పుడు అదే ప్రాంతం నుంచి మరో వెయిట్‌లిఫ్టర్‌ ఏకంగా రజతం కొల్లగొట్టి యావద్భారతావనిచే ప్రశంసలు అందుకుంటున్నాడు.

ఆశ్చర్యమేంటంటే అప్పుడు కాంస్యం, ఇప్పుడు రజతం సాధించింది తండ్రీ కొడుకులే. అత్యంత పిన్న వయసులో వెయిట్‌లిఫ్టింగ్‌లో కామన్వెల్త్‌ పతకం అందించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించిన వల్లూరి అజయ్‌ బాబు విజయగాధ తండ్రి శ్రీనివాసరావు అడుగు జాడల్లోనే మొదలైంది. అదేంటో తెలుసుకుందాం..

(హైదరాబాద్‌ ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)

వెయిట్‌లిఫ్టింగ్‌కు పెట్టింది పేరైన విజయనగరం జిల్లా నెలిమర్ల మండలంలోని కొండవెలగడ గ్రామం అజయ్‌ బాబు స్వస్థలం. అజయ్‌ తండ్రి శ్రీనివాసరావు 2010 న్యూఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో 56 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఒలింపిక్‌ పతకం సాధించాలన్న తండ్రి ఆశయం కలగానే మిగిలిపోవడంతో నాన్న స్వప్నాన్ని సాకారం చేసేందుకు వెయిట్‌లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న అజయ్‌ అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2021లో పటియాలాలో జరిగిన జూనియర్‌, యూత్‌, సీనియర్‌ విభాగాల్లో సాధించిన స్వర్ణ పతకాలతో జాతీయ స్థాయిలో అజయ్‌ పేరు మార్మోగింది. 2023లో నోయిడాలో జరిగిన జూనియర్‌ కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో స్వర్ణం కొల్లగొట్టాడు. 2024లో ఫిజీలో, ఈ ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన సీనియర్‌ కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షి్‌పలో పసిడి పతకాలు నెగ్గిన అజయ్‌కు కామన్వెల్త్‌ క్రీడల్లో పోటీ పడే అవకాశం లభించింది. గ్లాస్గోలో ఒక్క కేజీ తేడాలో స్వర్ణం కోల్పోయిన అజయ్‌ రజతంతో మెరిశాడు.

లక్ష్యం.. ఒలింపిక్‌ పతకం

ఈ కామన్వెల్త్‌ క్రీడల కోసం రెండేళ్లగా కఠోర సాధన చేస్తున్నా. ఎలాగైనా స్వర్ణం కొట్టాలనే పట్టుదలతో బరిలోకి దిగా. ఒక్క కేజీ తేడాతో పసిడి చేజారడం కొంత బాధగా ఉన్నా, రజతం సాధించిన ఆనందం దానిని మాయం చేసింది. సెప్టెంబరులో జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలే నా తదుపరి టార్గెట్‌. ఆతర్వాత 2028 ఒలింపిక్స్‌ సన్నాహకాలు ప్రారంభిస్తా. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడానికి ఈ ఏడాది చివరి నుంచి 2028 మార్చి వరకు పది అర్హత పోటీలు ఉన్నాయి. ఇందులో ఐదింట్లో సత్తా చాటితే ఒలింపిక్స్‌ బెర్త్‌ సాధించవచ్చు. ఆ దిశగా దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేసుకున్నా. కచ్చితంగా ఒలింపిక్స్‌లో దేశానికి పతకం అందిస్తా.

- వల్లూరి అజయ్‌ బాబు

చాంపియన్లను తయారు చేస్తా

అజయ్‌ సాధించిన విజయం ఒక తండ్రిగా కంటే మాజీ క్రీడాకారుడిగా ఎక్కువ సంతోషం కలిగించింది. 2030 కామన్వెల్త్‌ క్రీడలకు మరో నలుగురు తెలుగు లిఫ్టర్లను చాంపియన్లుగా తయారు చేస్తా. ప్రభుత్వం అవకాశం ఇస్తే శాప్‌ కోచ్‌గా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నా.

వల్లూరి శ్రీనివాసరావు (అజయ్‌ తండ్రి)

చరిత్రలో చిరస్థాయిగా..

కామన్వెల్త్‌ క్రీడల పోటీల్లో అజయ్‌ సాధించిన విజయం దేశానికి గర్వకారణం. దేశానికి రజతం అందించిన అజయ్‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌ స్నాచ్‌ విభాగంలో సరికొత్త రికార్డు నెలకొల్పి అజయ్‌ తన పేరును చరిత్రలో చిరస్థాయిగా లిఖించుకున్నాడు. అతను భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా.

- ప్రధాని నరేంద్ర మోదీ

/span>

ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy