Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అరగంటలోనే.. 'అల'కల్లోలం

అరగంటలోనే.. 'అల'కల్లోలం

  • సముద్రంలో బోటు బోల్తాపడి మత్స్యకారుడి మృతి

  • క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న మరో ముగ్గురు

  • మందస మండలం గెడ్డూరులో విషాదం

  • హరిపురం/ సోంపేట రూరల్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): మందస మండలం గెడ్డూరు తీరంలో చేపల వేటకు వెళ్లి బోటు బోల్తాపడిన ఘటనలో విషాదం చోటుచేసుకుంది.

  • ఈ సంఘటనలో వంక యాదవరావు(60) మృతిచెందగా.. మరో ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. గెడ్డూరుకు చెందిన వంక యాదవరావు, వంక ధర్మరాజు, వంక భీమరాజు, కొండ కూర్మారావు కలసి బోటుపై మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో చేపల వేటకు వెళ్లారు. తీరంలో కొద్దిదూరం వెళ్లగా.. అరగంటలోనే అలల ఉధృతికి బోటు బోల్తాపడింది. నలుగురు మత్స్యకారులు సముద్రంలో పడి చెల్లాచెదురయ్యారు. బోటు కిందబాగంలో యాదవరావు చిక్కుకున్నాడు. మిగతా ముగ్గురు ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరుకున్న తరువాత యాదవరావు రాకపోయేసరికి గ్రామంలోని మిగిలిన మత్స్యకారులు బోటులపై వెళ్లి వెతకసాగారు. దీంతో గెడ్డూరు, ఎర్రముక్కాం మధ్యలో విగతజీవిగా కొట్టుకొస్తున్న యాదవరావును చూసి ఒడ్డుకు చేర్చారు. 108లో హరిపురం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. గెడ్డూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. ఇంకా వివాహానికి చిన్న కుమార్తె మాత్రమే ఉంది. యాదవరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

  • ఎమ్మెల్యే శిరీష దిగ్ర్భాంతి...

  • బోటు బోల్తాపడిన విషాదకర ఘటన తెలుసుకున్న ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుడు యాదవరావుకు తన సంతాపాన్ని తెలియజేసి కుటుంబసభ్యులకు, ఘటనలో క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న ముగ్గురు మత్స్యకారులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy