Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అరంగేట్రం తర్వాత రెండేళ్లు అవకాశం కోసం ఎదురుచూశా: అజింక్య రహానె

అరంగేట్రం తర్వాత రెండేళ్లు అవకాశం కోసం ఎదురుచూశా: అజింక్య రహానె

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానె తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

జాతీయ జట్టులోకి వచ్చిన తొలి రెండేళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా 12వ ప్లేయర్‌గానే కొనసాగానని తెలిపాడు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. వాటిని సానుకూలంగా తీసుకుని ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు.

2011లో రహానె వైట్‌బాల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టు జట్టులో చోటు దక్కినా.. అరంగేట్రం చేసేందుకు మరో రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఈ సమయంలో జట్టుతో కలిసి పర్యటించినా ఎక్కువగా 12వ ఆటగాడిగానే ఉండేవాడు. చివరకు 2013లో ఆస్ట్రేలియాతో టెస్టు అరంగేట్రం చేశాడు. '2011లో జట్టులోకి వచ్చినప్పుడు తొలి రెండేళ్లు చాలా కఠినంగా గడిచాయి. టెస్టు అరంగేట్రం కోసం 20 మ్యాచ్‌ల వరకు వేచి చూడాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు 12వ ఆటగాడిగానే ఉన్నాను. అది నాకు సవాలుతో కూడుకున్న దశ. అయితే దాని నుంచి చాలా నేర్చుకున్నా. ఆ సమయంలో నాకు రెండు మార్గాలు కనిపించాయి. ఒకటి సానుభూతి పొందడం.. మరొకటి నన్ను నేను మెరుగుపరుచుకోవడం. 12వ ఆటగాడిగా ఉండటంలో, సహచరులకు డ్రింక్స్ అందించడంలో లేదా వారికి సహాయం చేయడంలో తప్పేమీ లేదు. నేను దానిని సానుకూలంగా తీసుకున్నా. నేను ప్రతి విషయాన్ని గమనించేవాడిని. దాని వల్ల నా వైఖరి, ఆలోచనా విధానం మెరుగయ్యాయి. సానుభూతి పొందడం చాలా సులభం. కానీ నేను ఎప్పుడూ దానిని కోరుకోలేదు. ఆ అనుభవమే నన్ను సుదీర్ఘకాలం క్రికెట్ ఆడేలా చేసింది' అని రహానె పేర్కొన్నాడు.

ఓపికతోనే సుదీర్ఘ ప్రయాణం

తన కెరీర్‌లో ఓపిక ఎంతో కీలక పాత్ర పోషించిందని రహానె చెప్పాడు. అయితే చిన్నప్పటి నుంచే తనలో అంతటి సహనం లేదని వెల్లడించాడు. 'నాకు మొదటి నుంచి ఓపిక అస్సలు ఉండేది కాదు. ఆటలో అనుభవం పెరిగే కొద్దీ అది కూడా అలవడింది. ముంబైలో లోకల్ రైలులో ప్రయాణించడం కూడా సవాలుతో కూడుకున్నదే. అక్కడి నుంచే ఎక్కడో ఓపిక పెరుగుతుంది. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతూ వరుసగా పరుగులు సాధిస్తే.. భారత్‌కు ఎప్పుడు ఎంపిక చేస్తారనే ఆలోచన సహజంగానే వస్తుంది. నాకు కూడా అలాంటి ఆలోచనే ఉండేది. అయితే సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడిన తర్వాత, టైమ్ వచ్చినప్పుడు అవకాశం తప్పకుండా వస్తుందని అర్థమైంది. మన చేతుల్లో ఉన్నదానిపైనే దృష్టి పెట్టాలి. సుదీర్ఘకాలం క్రికెట్ ఆడాలంటే ఓపిక చాలా ముఖ్యం' అని రహానె వివరించాడు.

strong>

గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ టైటిల్ విజేతగా ప్రజ్ఞానంద

శ్రీలంక సిరీస్‌లో భారత్‌కు 'డూ ఆర్ డై'.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy