ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (మంగళవారం) అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్‌లో భారత సైనికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అస్సాం రైఫిల్ జవాన్ మృతి చెందారు.
భారత్-మయన్మార్ సరిహద్దు వద్ద కంచె పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ 21 మంది అస్సాం రైఫిల్స్ జవాన్లు గస్తీ కాస్తున్నారు. కొందరు ఉగ్రవాదులు ఉదయం 6.30 నిమిషాలకు వీరిపై దాడికి పాల్పడ్డారు. ఇందులో హవిల్దార్ జంఖోకై కుకీ (42) అనే జవాను వీరమరణం పొందారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారని తెలిపాయి.
కాగా గాయపడ్డ జవాన్లను అధికారులు మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు ఆపరేషన్లను చేపట్టాయి. ఎన్ఎస్‌సీ కే-వైఏ అనే మిలిటెంట్ గ్రూప్ ఈ దాడి చేసిందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీని గురించి అస్సాం రైఫిల్స్ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

