ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని కాజీరంగ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోంగాజన్ ప్రాంతంలో ట్రక్కు, మినీబస్సు బలంగా ఢీకొన్న ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బోకాఖత్ నుంచి నాగావ్కు ప్రయాణికులతో వెళ్తున్న మినీబస్సును ఎదురుగా వచ్చిన కంటైనర్ ట్రక్కు ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం.
మినీబస్సు పూర్తిగా ధ్వంసమై.. పలువురు ప్రయాణికులు వాహనంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థితి భీతావహంగా మారగా.. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాద వాతావరణం నెలకొంది.
కజిరంగాలో జరిగిన ఘోర ప్రమాదంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరగడం తనను కలచివేసిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహారాష్ట్రలో రన్వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..

