Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు

అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు

చిత్తూరు, జులై 28: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. వివేకవంతమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాలని వారికి సూచించారు.

కుప్పం పర్యటనలో భాగంగా రెండో రోజు మంగళవారం స్థానిక పీఈఎస్ వైద్య కళాశాల ఆడిటోరియంలో విద్యార్థులతో నారా భువనేశ్వరి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థుల క్రీడలను వీక్షించారు. అలాగే క్విజ్‌ పోటీలో పాల్గొన్న విద్యార్థులను ఆమె పలు ప్రశ్నలు అడిగారు. అనంతరం నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థులతో కలిసి క్విజ్ పోటీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే తల్లిదండ్రులకు పిల్లలు అండగా నిలవాలని సూచించారు.

మంచి వ్యక్తులతో స్నేహం మన ఉన్నతికి దోహదపడుతుందని తెలిపారు. తన మనవడు దేవాన్ష్ పుస్తకాలు బాగా చదువుతాడని.. టీవీ, మొబైల్‌కి దూరంగా ఉంటాడని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తున్నాయని వివరించారు. విద్యార్థుల చదువుకు చేయూత అందించేందుకు మన ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఒక్కో బిడ్డకు రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందిస్తోందని తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో ప్రైవేటు నుంచి 1.06 లక్షల మంది విద్యార్థులు మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని సోదాహరణగా వివరించారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు నారా భువనేశ్వరి సూచించారు. డ్రగ్స్‌తో జీవితాలు నాశనమవుతాయని.. వ్యసనాల నుంచి బయటపడటం చాలా కష్టమని అన్నారు. పరీక్షల్లో విఫలమవడం జీవితానికి ముగింపు కాదని పేర్కొన్నారు. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. అలాంటి చర్యల వల్ల కన్నతల్లిదండ్రులు కుంగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని.. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు.

గురువులు మార్గదర్శకులని.. వారిని గౌరవించాలని విద్యార్థులకు నారా భువనేశ్వరి సూచించారు. జాతిపిత మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్రమోదీ వంటి వారి నుంచి స్ఫూర్తి పొందాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. మహాత్మునిలా సమాజానికి సేవ చేసే గుణం అలవరుచుకోవాలని విద్యార్థులతో అన్నారు. యువత చేతిలోనే మన దేశ భవిష్యత్ ఉందని గుర్తు చేశారు. ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వారికి సూచించారు.

లక్ష్యంతో ముందుకెళ్తే టీచర్, ఇంజినీర్, డాక్టర్, బిజినెస్ మ్యాన్, పోలీస్, ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా సాధించవచ్చని విద్యార్థులకు స్పష్టం చేశారు. దేశ రక్షణలో పోలీసుల సేవలు అమూల్యమైనవని అభివర్ణించారు. క్రమశిక్షణతో జీవిస్తే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని విద్యార్థులతో నారా భువనేశ్వరి పేర్కొన్నారు.

29 వేల రేషన్ దుకాణాలు మరింత బలోపేతం: మంత్రి నాదెండ్ల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy