Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అయోధ్య విరాళాల చోరీపై విపక్షం వ్యంగ్య నాటకం!

అయోధ్య విరాళాల చోరీపై విపక్షం వ్యంగ్య నాటకం!

  • కాషాయ వస్త్రాల్లో పప్పుయాదవ్‌

  • హుండీలో రాహుల్‌ కానుకలు

  • వాటిని జేబులో వేసుకున్న యాదవ్‌

  • పార్లమెంటు వద్ద నిరసన ప్రదర్శన

  • ఆ ఎంపీల్ని సభ నుంచి బహిష్కరించాలి

  • వీహెచ్‌పీ, సాధువుల డిమాండ్‌

  • ఇది ధర్మంపై దాడే: కేంద్ర మంత్రి గిరిరాజ్‌

న్యూఢిల్లీ, జూలై 31: అయోధ్య రామమందిరంలో జరిగిన విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పార్లమెంటులో ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. కానీ, ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో విరాళాల చోరీ వ్యవహారంపై ఇండిపెండెంట్‌ ఎంపీ రాజేశ్‌ రంజన్‌ అలియాస్‌ పప్పు యాదవ్‌ వ్యంగ్య నాటకం(స్కిట్‌) పేరుతో వినూత్న నిరసన తెలిపారు. దీనిలో కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా పాత్రధారులయ్యారు. కాషాయ వస్త్రాలు ధరించి వచ్చిన పప్పు యాదవ్‌ పార్లమెంటు ఆవరణలోని మకర ద్వారం ముందు కూర్చుని విరాళాలు సేకరిస్తారు. ఆయన తన ముందు ఓ హుండీని పెట్టుకుంటారు. ఈ సమయంలో అక్కడకు వచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ సహా పలువురు ఎంపీలు భక్తుల మాదిరిగా విరాళాలు సమర్పిస్తారు. అయితే.. హుండీలో వేయాల్సిన విరాళాలను పప్పు యాదవ్‌ తన జేబులో వేసుకుని ఉడాయించే ప్రయత్నం చేస్తారు. దీనిని గమనించి.. భక్తుల మాదిరిగా వ్యవహరించిన ఎంపీలు ఆయనను వెంబడించి పట్టుకుని దేహశుద్ధి చేస్తున్నట్టు నటిస్తారు. దీంతో స్కిట్‌ పూర్తవుతుంది. ఈ నాటకంలో కాంగ్రెస్‌ ఎంపీలు ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ ఎంపీలు అవదేశ్‌ ప్రసాద్‌, ధర్మేంద్ర యాదవ్‌, జేఎంఎం ఎంపీ మహువా మాజీ తదితరులు భక్తులుగా నటించారు. ఈ సందర్భంగా వెనుక భాగంలో భారీ సంఖ్యలో నిలబడ్డ ప్రతిపక్ష ఎంపీలు.. 'అమిత్‌ షా సభలో ఎందుకు కనిపించడం లేదు?' అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. కాగా, పార్లమెంటు ఆవరణలో ఇలాంటి నిరసనలను నిషేధిస్తూ.. ఇటీవల ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో తాజా ఘటనను లోక్‌సభ సెక్రటేరియట్‌ సీరియ్‌సగా తీసుకుంది. ప్రత్యేక వేషధారణలు, నాటకీయ నిరసనలకు పార్లమెంటు ఆవరణలో నిషేధించామని సెక్రటేరియట్‌ వర్గాలు తెలిపాయి. తాజా నిరసనపై స్పీకర్‌ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారని పేర్కొన్నాయి. ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌ స్పందిస్తూ.. ''అయోధ్య విరాళాల చోరీ విషయంపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిరసన చేపట్టాం. చోరీ ఘటనలో సీసీటీవీ ఫుటేజీని కూడా మాయం చేశారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలని మేం కోరుకుంటున్నాం.'' అని ఆయన పేర్కొన్నారు. విపక్షాల వినూత్న నిరసనపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని పాటించేవారు, గౌరవించేవారు ఈ నాటకాలను చూస్తూ ఊరుకోరని, తాము క్షమించబోమని ఆయన వ్యాఖ్యానించారు.

రావణుడిని తలపించిన పప్పూ : వీహెచ్‌పీ

ప్రతిపక్షాల స్కిట్‌పై విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) సహా సాధు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. కాషాయ వస్త్ర ధారణతో నాటకం ప్రదర్శించడాన్ని తప్పుబట్టాయి. ఈ నిరసన హిందువుల మనోభావాలను, సాధువుల జీవన శైలిని తీవ్రంగా దెబ్బతీసిందని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ వ్యాఖ్యానించారు. నిరసన కారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీతను అపహరించేందుకు సాధువు వేషంలో వచ్చిన రావణుడి మాదిరిగా పప్పు యాదవ్‌ వ్యవహరించారని దుయ్యబట్టారు. కాషాయ వస్త్రాలు కట్టినంత మాత్రాన హిందువుల విశ్వాసాన్ని వారు చూరగొనలేరని విమర్శించారు. అఖిల భారతీయ సంత్‌ సమితి సభ్యులు మాట్లాడుతూ.. ఈ నిరసనలో పాల్గొన్న ఎంపీలను సభ నుంచి బహిష్కరించాలని, వారి సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy