వరంగల్ పెద్దాస్పత్రికి సమస్యల జబ్బు
సౌకర్యాలు లేక అల్లాడుతున్న రోగులు
15 నెలలుగా నిలిచిపోయిన శస్త్రచికిత్సలు
రసాయనాలు లేక ఆగిపోయిన రక్త పరీక్షలు
ఏడాదిగా పనిచేయని 2డీ ఎకో పరికరాలు
మూలనపడ్డ క్యాన్సర్ రేడియేషన్ యంత్రం
తుప్పుపట్టిన స్ట్రెచర్లు, విరిగిన సెలైన్ స్టాండ్లు
స్లాబ్ పెచ్చులూడిపడి పలువురికి గాయాలు
వరంగల్ మెడికల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రోగులను తీసుకెళ్లడానికి స్ట్రెచర్లు ఉండవు.. సెలైన్ స్టాండ్లు కనిపించవు.. ఏడు అంతస్తుల భవనంలో వెయ్యి పడకలుంటే పని చేసేది ఒక్కటే లిఫ్ట్.. రక్త పరీక్షలకూ దిక్కుండదు.. 2డీ ఎకో వంటి పరికరాలూ పని చేయవు.. ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు లేవు.. ఉన్నా పనిచేయవు.. శస్త్ర చికిత్సలు లేవు.. నిపుణులైన సిబ్బందీ లేరు.. ఇదీ వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి(ఎంజీఎం) దుస్థితి. ఒకప్పుడు 4 ఉమ్మడి జిల్లాలకు పెద్దాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎం... ఇప్పుడు సమస్యల జబ్బుతో కునారిల్లుతోంది. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా రోగులకు వైద్య సేవలందించడంలో పీహెచ్‌సీల కన్నా అధ్వానంగా మారింది. రోజుకు వేలాది మంది ఔట్‌పేషెంట్లు, వందలాది మంది ఇన్‌పేషెంట్లు వస్తున్నా.. వైద్యం మిధ్య అన్న చందంగా పరిస్థితి ఉంది. వెయ్యి పడకల పెద్ద ఆస్పత్రిలో రక్త, వైద్య పరీక్షలు చేయడానికి రసాయనాలు కూడా లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అడుగడుగునా సమస్యలు
వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో అడుగు పెట్టగానే కనిపించేంది ఓపీ విభాగం. ఎంజీఎంతోపాటు అనుబంధ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి కలిపి రోజూ తక్కువలో తక్కువగా 4వేల మంది ఔట్ పేషెంట్లు (ఓపీ)వస్తుంటారు. ఇంత మందికి స్లిప్‌లు ఇచ్చేందుకూ సిబ్బంది కొరత ఉంది. స్లిప్‌లు ఇచ్చే ప్రింటర్ చాలా కాలంగా పని చేయకపోవడంతో తెల్ల కాగితా లు, కేస్ షీట్లపై స్లిప్‌లు రాసిస్తున్నారు. రసాయనాల కొరతతో రోగ నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. దీంతో రోగులు ఆయా పరీక్షలను ప్రైవేట్ డయాగ్నస్టిక్స్‌లో చేయించుకుంటున్నారు. ఏడాదిగా 2డీ ఎకో పరికరాలు పని చేయడంలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈపరీక్ష కోసం రూ. 1500 ఖర్చవుతుడడంతో పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
కార్డియాలజీ విభాగంలో నిపుణులైన వైద్యులు, సిబ్బంది లేకపోవడం.. మరింత జఠిలంగా మారింది. ఫిజియోథెరపీ విభాగంలో ఒకే ఒక్క డాక్టర్ ఉన్నారు. అంకాలజీలోనూ ఒక్కరే పని చేస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో కీలకపాత్ర పోషించే రేడియేషన్ యంత్రం మూలనపడి చాలా కాలమైంది. దీంతో రోగులను అత్యవసర పరీక్షలు, చికిత్స కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. మరోవైపు.. ఆస్పత్రిలో రోగులను తరలించే స్ర్టెచర్లు చాలా వరకు తుప్పుపట్టి పోయాయి. ఆస్పత్రికి 500 స్ర్టెచర్లు అవసరం ఉండగా... ప్రస్తుతం 100కు మించి లేవు. సెలైన్ స్టాండ్లు వెయ్యి వరకు అవసరం కాగా, 100కు మించి లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సెలైన్ బాటిళ్లను రోగుల బంధువులే పట్టుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇక, ఎంజీఎం ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పరిస్థితీ అత్యంత అధ్వానంగా ఉంది.
వైద్య పరికరాలు పని చేయకపోవడంతో యూరాలజీ, న్యూరాలజీ, సీటీవీఎస్, పీడియాట్రిక్ సర్జరీలు చాలా రోజులుగా నిలిచిపోయాయి. ఆస్పత్రిలో ఏసీలు మరమ్మతు చేయాలంటే రూ.50లక్షలు అవసరమవుతాయని గతంలో ప్రతిపాదించారు. ఆ నిధులు విడుదల కాకపోవడంతో ఏసీలు పని చేయడం లేదు. ఫలితంగా ఆపరేషన్ థియేటర్లు మూతపడి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 15 నెలలుగా శస్త్రచికిత్సలు ఆగిపోయాయి. అవసరం ఉన్న రోగులను హైదరాబాద్‌లోని ఉస్మానియా లేదా గాంధీ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. ఏడంతస్తుల ఆస్పత్రి భవనంలో రోగులను ఆయా విభాగాలకు తరలించడమూ కష్టమవుతోంది. దవాఖానాలో 6 లిఫ్టులు ఉండగా.. ఒక్కటి మాత్రమే పని చేస్తోంది. ఫలితంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులను డయాలసిస్ విభాగానికి పంపాలంటే నానా తంటాలు పడాల్సి వస్తోంది.
న్యూరోసర్జన్ నర్సింగరావు ఆ విభాగానికి హెచ్‌వోడీగా ఉన్నప్పుడు నెలకు 50 శస్త్రచికిత్సలు జరిగేవి. ఆయనను కొత్తగూడేనికి బదిలీ చేయగా.. అక్కడ న్యూరో ఆపరేషన్లు లేక ఖాళీగా ఉంటున్నారు. ఆపరేషన్లు చేసే వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీఎం కోసం ఏళ్ల కిందట నిర్ణయించిన బడ్జెట్‌నే ఇప్పటికీ మంజూరు చేస్తున్నారు. పెరిగిన రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు బడ్జెట్ కేటాయించాలని, పరికరాల మరమ్మతులకు నిధులు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపినా బుట్టదాఖలయ్యా యి. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ తీర్మానాలు సైతం అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా పేదరోగు ల అవస్థలను దృష్టిలో పెట్టుకొని ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని, వసతులు కల్పించాలని రోగులు కోరుతున్నారు.
స్లాబ్ పెచ్చులూడి.. పలువురికి గాయాలు
వరంగల్ మెడికల్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో స్లాబ్ పెచ్చులూడి ఫాల్స్ సీలింగ్‌పై పడి.. ఆ శిథిలాలు కింద పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఆరోగ్యశ్రీ వార్డులో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడే చికిత్స పొందుతున్న మస్తాన్ (55), సహాయకులు ఎల్లమ్మ, ఓంకార్‌లపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఎంజీఎం వైద్యులు.. తీవ్రంగా గాయపడ్డ వారిని ఎమరెన్సీ వార్డుకు తరలించి చికిత్స అందించారు. గతంలోనూ ఇక్కడ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. పేదల ఆస్పత్రిగా ప్రసిద్ధికెక్కిన ఎంజీఎంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:

