Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బహ్రెయిన్‌లో కొలువుదీరిన తెలుగు కళా సమితి కొత్త కార్యవర్గం

బహ్రెయిన్‌లో కొలువుదీరిన తెలుగు కళా సమితి కొత్త కార్యవర్గం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: గల్ఫ్‌లోని బహ్రెయిన్‌లోగల అత్యంత కీలకమైన ప్రవాసాంధ్ర సంఘం తెలుగు కళా సమితిలో బుధవారం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది.

నూతన అధ్యక్షుడిగా కరణం యుగంధర్ ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన మూడు దశాబ్దాలకు పైగా బహ్రెయిన్‌లో నివసిస్తున్నారు. ఉపాధ్యక్షులుగా కామారెడ్డి జిల్లాకు చెందిన జి.వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శిగా నరసాపురానికి చెందిన సతీశ్ శెట్టి, కోశాధికారిగా పందిరి అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా దయాల సింధూజ, కార్యవర్గ సభ్యులుగా నరేశ్ బాల్క, సేనాపతి హరికృష్ణ, చుక్కళ్లపల్లి చంద్రబాబు, పర్వతనేని కిషోర్ బాబు ఎన్నికైయ్యారని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన అక్కినపల్లి వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కార్యవర్గం గడువు రెండేళ్ళ వరకు ఉంటుంది.

బహిరంగంగా నామినేషన్లను ఆహ్వానించినా వీరు మాత్రమే దాఖలు చేయడంతో వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. బహ్రెయిన్‌లోని ప్రవాసాంధ్ర ప్రముఖులు రఘునాథ్ బాబు, హరిబాబుల నేతృత్వంలో మెజారిటీ సభ్యులు ఏకాభిప్రాయానికి వచ్చి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల మధ్య సమతౌల్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ఇటీవల కాలంలోని ఉద్రిక్తత పరిస్థితుల్లో వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు మందగించిన నేపథ్యంలో రానున్న రెండేళ్ల పాటు సంఘాన్ని చురుగ్గా నడిపించడం సవాలుగా మారే అవకాశం ఉంది. బహ్రెయిన్‌లో తెలంగాణవాదాన్ని బలంగా వినిపించే తెలంగాణ ప్రవాసీ సంఘమైన టి.సి.ఎ ముఖ్య నాయకుడిని కూడా కార్యవర్గంలోకి తీసుకోవడం ద్వారా తెలుగువారందరూ ఒక్కటేననే బలమైన సందేశాన్ని పంపించారు. సర్వసభ్య సమావేశం, అధికార ఆమోదం లభించిన అనంతరం నూతన కార్యవర్గం అధికారికంగా అమలులోకి వస్తుందని తెలిసింది.

నిరంతరం వివిధ సందేశాత్మక, వైవిధ్యభరిత వినోద, సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతూ ప్రవాసీయుల ఆదరణ పొందుతున్న బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి గల్ఫ్ దేశాలన్నింటిలోని పాత తెలుగు ప్రవాసాంధ్ర సంఘాలలో ఒకటి. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఇది మనుగడలో ఉంది. ఇక్కడ విదేశీ ప్రవాసీ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు విధానం అమల్లో ఉంది. ఈ గుర్తింపు ఉన్న భారత సంఘాల్లో తెలుగు భాషాపరంగా తెలుగు కళా సమితి ఒకటి. ఈ సంఘానికి సొంత కార్యాలయ భవనం కూడా ఉంది. బహ్రెయిన్‌లో మూడున్నర లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా అందులో రెండు లక్షల మంది వరకు మలయాళీలు ఉన్నారు. ఆ తరువాతి స్థానంలో సుమారు 50 వేల మంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయులు ఉన్నారని ఒక అంచనా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy