Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డు సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే కేంద్రాన్ని సంప్రదించనున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే తమ దేశానికి రావాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఇప్పటికే బీసీసీఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. రెండు దేశాల క్రికెట్‌ బోర్డుల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని బీసీసీఐ అధికారి తెలిపారు. త్వరలోనే పర్యటనపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు బంగ్లాదేశ్‌ షెడ్యూల్‌ విండోను కేటాయించింది. ఇందులో మూడు వన్డేలు, మూడు టీ20లు ఉన్నాయి. సెప్టెంబర్‌ 1, 3, 6 తేదీల్లో వన్డేలు.. సెప్టెంబర్‌ 9, 12, 13 తేదీల్లో టీ20లు జరగాల్సి ఉంది. ఆగస్టు 28న భారత జట్టు బంగ్లాదేశ్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతిపైనే పర్యటన ఆధారపడి ఉన్నట్లు సమాచారం.

ముస్తాఫిజుర్‌ వివాదంతోనే..

భారత్‌-బంగ్లాదేశ్‌ క్రికెట్‌ సంబంధాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పర్యటనపై అనిశ్చితి కొనసాగుతోంది. 2026 ఐపీఎల్‌ వేలంలో బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత బీసీసీఐ ఆదేశాలతో అతడిని జట్టు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిణామంపై బంగ్లాదేశ్‌ తీవ్రంగా స్పందించింది. అనంతరం భద్రతా కారణాలను చూపుతూ 2026 టీ20 ప్రపంచకప్‌ కోసం భారత పర్యటనకు తమ జట్టు రాదని బీసీబీ ప్రకటించింది. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లను భారత్‌ నుంచి ఇతర వేదికలకు మార్చాలని ఐసీసీని కోరింది. ఈ వివాదం అంతర్జాతీయ క్రికెట్‌కే పరిమితం కాలేదు. ముస్తాఫిజుర్‌ వ్యవహారం నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్‌ ప్రసారం, ప్రచారాన్ని ఆ దేశ ప్రభుత్వం నిరవధికంగా నిలిపివేసింది.

గతంలోనూ వాయిదా..

భారత జట్టు 2025 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ కట్టుబాట్లు, షెడ్యూల్‌ సౌలభ్యం కారణంగా ఆ పర్యటనను 2026 సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు ఈ సిరీస్‌ ఇరు దేశాల క్రికెట్‌ సంబంధాలకు కీలకంగా మారింది. బంగ్లా-భారత్ మధ్య మ్యాచ్ నిర్వహించాలని బీసీబీ పట్టుదలగా ఉంది. ఇరు బోర్డుల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే నిర్ణయంపైనే సిరీస్‌ భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ పర్యటన జరిగితే గత కొంతకాలంగా దెబ్బతిన్న భారత్‌-బంగ్లాదేశ్‌ క్రికెట్‌ సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని బీసీబీ ఆశిస్తోంది.

strong>

ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పులు?.. కోచింగ్ బృందంలో గంగూలీ, యువరాజ్ సింగ్!

ఎవరినీ బలిపశువుగా చూపించడం సరికాదు.. ప్లేయర్ల గాయాలపై స్పందించిన లక్ష్మణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy