పాట్నా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్(Nitin Nabin) ఖాళీ చేసిన బంకీపూర్(Bankipur) నియోజకవర్గం ఉప ఎన్నికలో జన్ సురాజ్(Jan Suraaj) పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) ప్రకటించారు.
బంకీపూర్‌లో బీజేపీని ఓడిచే సామర్థ్యం జన్‌సురాజ్‌కే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జన్ సురాజ్ పార్టీ 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి 238 సీట్లలో పోటీ చేసింది. అయితే ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. అధికార ఎన్డీయే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికలకు ముందు పథకాల పేరుతో ఒక్కో మహిళకు రూ.10,000 చొప్పున ఇవ్వడం ఎన్నికల ఫలితాలను దెబ్బతీసిందని ఎన్నికల ఫలితాల అనంతరం ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు.
బంకీపూర్‌ను వదులుకున్న నితిన్ నబిన్
బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకర్గం నుంచి గతం అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబిన్ పోటీ చేసి వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆర్జేడీపై 50,000 ఓట్ల ఆధిక్యంలో ఆయన గెలుపొందగా, జన్ సురాజ్ పార్టీ మూడో స్థానంలో నిలించింది. గత జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నికయ్యారు. అనంతరం రాజ్యసభకు ఎన్నిక కావడంతో గత నెలలో బంకీపూర్ నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో బంకీపూర్‌లో ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.
బంకీపూర్ నుంచి పీకే పోటీ?
బంకీపూర్ నియోజకవర్గం నుంచి జన్ సురాజ్ పోటీ చేస్తుందని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ .. ఆ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలపై నేరుగా సమాధానం ఇవ్వలేదు. దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పార్టీ సంస్థాగత పనులపై దృష్టి సారించేందుకే తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదని, పార్టీ సమష్టి నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.
పీకేను జనం కోరుకుంటున్నారు..
కాగా, జన్ సురాజ్ బిహార్ అధ్యక్షుడు మనోజ్ భారతి మాట్లాడుతూ, నితిన్ నబిన్ జాతీయ అధ్యక్షుడు కావడంతో బంకీపూర్ నియోజకవర్గం ఇప్పుడు వీవీఐపీ సీటుగా మారిందన్నారు. దీంతో బీజేపీ కూడా శక్తివంచన లేకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తుందని, జన్ సురాజ్ నుంచి గట్టి నేతను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గత 20 రోజులుగా నియోజకవర్గం ప్రజలతో మాట్లాడుతున్నామని, ప్రశాంత్ కిషోర్‌ను తమ అభ్యర్థిగా చూడాలని బంకీపూర్ కోరుకుంటున్నట్టు తమ పరిశీలనలో తేలిందని అన్నారు. పార్టీ కార్యనిర్వాహకవర్గం, ప్రశాంత్ కిషోర్ అంగీకరిస్తే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుందని చెప్పారు.

