Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బేస్‌బాల్ ప్లేయర్‌గా మారిన ఇంగ్లండ్ ప్రపంచ కప్ విజేత

బేస్‌బాల్ ప్లేయర్‌గా మారిన ఇంగ్లండ్ ప్రపంచ కప్ విజేత

స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత మరో క్రీడలో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా రాణించడం చాలా అరుదు. ఇంగ్లండ్ మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్, 2019 వన్డే ప్రపంచకప్ సభ్యుడు లియామ్ ప్లంకెట్ ఇప్పుడు సరిగ్గా అదే చేసి చూపించాడు.

41 ఏళ్ల ప్లంకెట్ అమెరికాలోని ఓక్లాండ్ బేలర్స్ తరఫున ప్రొఫెషనల్ బేస్‌బాల్‌లోకి అరంగేట్రం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ప్రొఫెషనల్ బేస్‌బాల్ ఆడిన తొలి ఇంగ్లిష్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

ప్లంకెట్ 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత అమెరికన్ మహిళను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో ఆటగాడిగా, కోచ్‌గా సేవలందించాడు. 'పయనీర్ బేస్‌బాల్ లీగ్' ప్రత్యేక మార్కెటింగ్ నిబంధనల ప్రకారం 'ఓక్లాండ్ బేలర్స్' జట్టు ప్లంకెట్‌తో ఒప్పందం చేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లీగ్ తరఫున అరంగేట్రం చేసిన ప్లంకెట్.. తన మొదటి బంతికే బ్యాటర్‌ను 'స్ట్రైకౌట్' చేయడం విశేషం.

దీనిపై అతను స్పందిస్తూ.. 'మొదట్లో ఇది కేవలం ప్రదర్శన మ్యాచ్ అనుకున్నాను. కానీ నిజమైన ప్రొఫెషనల్ మ్యాచ్ అని తెలిసి కాస్త కంగారు పడ్డా. నా బౌలింగ్ యాక్షన్, పిచింగ్ కలయికతో వేసిన బంతిని బ్యాటర్ అంచనా వేయలేకపోయాడు. తొలి మ్యాచ్‌లోనే స్ట్రైకౌట్ చేయడం చాలా ఆనందంగా ఉంది' అని ప్లంకెట్ సంతోషం వ్యక్తం చేశాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్లంకెట్, ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు, 89 వన్డేలు, 22 టీ20లు ఆడి 130కి పైగా వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 2019 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సహా కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్ తొలిసారి ఛాంపియన్‌గా నిలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.

ఇది కూడా చదవండి:

యూఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ సెమీస్‌కు రౌనక్‌

ఫిఫా ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన కాబో వెర్డె

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy