Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భారత హాకీకి కొత్త జెర్సీ..  హెచ్‌ఐ నిర్ణయంపై మాజీ కెప్టెన్ అసంతృప్తి!

భారత హాకీకి కొత్త జెర్సీ.. హెచ్‌ఐ నిర్ణయంపై మాజీ కెప్టెన్ అసంతృప్తి!

స్పోర్ట్స్ డెస్క్: రాబోయే పురుషుల, మహిళల హాకీ ప్రపంచకప్‌ల కోసం 'హాకీ ఇండియా' భారత జాతీయ జట్ల కొత్త జెర్సీలను ఆవిష్కరించింది. అయితే ఇప్పటి వరకు నీలం రంగులో మెరిసిన భారత హాకీ కిట్, ఈసారి ఆరెంజ్ రంగులోకి మారడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆగస్టు 14 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా పురుషుల టోర్నీ జరగనుంది. అలానే ఆగస్టు 15 నుంచి 30 వరకు మహిళల పోటీలు జరగనున్నాయి.

హాకీ ఇండియా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. 'భారత హాకీ పురోగతికి హాకీ ఇండియా ఎన్నో మంచి పనులు చేసింది. కానీ జెర్సీ రంగు మార్చే నిర్ణయం మాత్రం విచారకరం. దశాబ్దాలుగా భారత జట్టు గుర్తింపు, వారసత్వం 'బ్లూ' రంగుతోనే ముడిపడి ఉంది. అభిమానులు మన జట్టును నీలం రంగు డ్రెస్‌లోనే చూడాలనుకుంటారు. అసలు ఈ ఆరెంజ్ రంగు వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు' అని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మరోవైపు ప్రపంచకప్‌ 2026లో భాగంగా భారత్ పూల్-డి లో ఇంగ్లండ్, వేల్స్, పాకిస్థాన్‌లతో కలిసి పోటీపడనుంది. 1975లో పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచకప్ గెలిచిన భారత్.. గత 50 ఏళ్లుగా ఆ స్వర్ణ పతక విజయాన్ని పునరావృతం చేయలేకపోయింది. భువనేశ్వర్‌లో జరిగిన ప్రపంచకప్‌2023లో 9వ స్థానంతో సరిపెట్టుకున్న మన జట్టు, ఈసారి మాత్రం ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వరుసగా రెండు ఒలింపిక్ కాంస్య పతకాలు, ఆసియా కప్, ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయాలతో లభించిన ఆత్మవిశ్వాసంతో భారత్ ఈసారి కప్‌ను ముద్దాడాలని పట్టుదలతో ఉంది.

ఇవీ చదవండి:

అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే గుడ్ బై

ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త మైలురాయి.. 300 మిలియన్ డాలర్ల బ్రాండ్‌గా ఆర్సీబీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy