ఇంటర్నెట్ డెస్క్: తన భార్యను కాపురానికి పిలిచినందుకు.. బావకు నిప్పంటించి చంపాడు బావమరిది. ఈ దారుణమైన ఘటన పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లాలో చోటు చేసుకుంది.
తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి కాపురానికి తీసుకురావడానికి వెళ్లిన ఒక వ్యక్తిని, అతని బావమరిది నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ క్రమంలో అతడిని కాపాడటానికి ప్రయత్నించిన మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాధితులను లవ్‌ప్రీత్ సింగ్, గుర్జీత్ కౌర్‌లుగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లవ్‌ప్రీత్ సింగ్ భార్య సందీప్ కౌర్ కొన్ని కుటుంబ మనస్పర్థల కారణంగా తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో జూన్ 13న లవ్‌ప్రీత్ సింగ్ ఆమెను ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి అత్తగారింటికి వెళ్లాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన లవ్‌ప్రీత్ బావమరిది సాజన్ సింగ్, పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతున్న లవ్‌ప్రీత్‌ను కాపాడటానికి సాజన్ సింగ్ వదిన అయిన గుర్జీత్ కౌర్ అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఈ ప్రయత్నంలో ఆమెకు కూడా మంటలు అంటుకున్నాయి. తీవ్రమైన గాయాలపాలైన లవ్‌ప్రీత్ సింగ్, గుర్జీత్ కౌర్ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘోర దాడిలో నిందితుడు సాజన్ సింగ్‌కు కూడా స్వల్ప గాయాలు కావడంతో ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హృదయవిదారక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

