నగరాల్లో రోడ్డు మీద ప్రయాణం ఒక నరకం. అడు గడుగునా ఆటంకాలే. ఒక్కోసారి రెక్కలుంటే బాగుణ్ణు అనిపిస్తుందెవరికైనా. అది సాధ్యం కాకపోవచ్చు కానీ, రోడ్డు మీద నడుస్తుంటే...
హఠాత్తుగా కాసేపు ఎగిరే ఛాన్స్ లేకపోలేదంటున్నారు నిపుణులు. అందుకోసం ఏకంగా ఒక బ్యాక్‌ప్యాక్‌నే తయారుచేశారు.
ల్యాప్‌టాప్, బట్టలు పెట్టుకోవడానికి బ్యాక్‌ప్యాక్ వాడతాం కదా... ఇప్పుడు దానితోనే అవసరమైనప్పుడు అమాంతం గాల్లోకి తేలిపోవచ్చని అంటున్నారు జపాన్‌కు చెందిన టోక్యో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు. దీనికి 'లూనావిటీ' అని నామకరణం చేశారు. ఇది మల్టీరోటర్ వ్యవస్థతో అచ్చు ఒక డ్రోన్‌లా పనిచేస్తుందన్నమాట. దీంట్లో మొత్తం 16 రోటర్లను ఉపయోగించారు. వీటివల్ల తక్కువ గురుత్వాకర్షణ శక్తిని కలిగి... మనిషి అమాంతం గాలిలో ఎగిరేలా చేస్తుంది.
అయితే.. ఇక్కడ దూకడానికి అవసరమైన శక్తిని కాళ్లే అందిస్తాయి సుమా. శరీరంతోనే కదలికలను నియంత్రిస్తూ మరింత ఎత్తుకు ఎగురుతారంతే. అలాగే ఎక్కువ సేపు గాలిలో ఉండగలుగుతారు. గాలిలో ఉన్నప్పుడు రోటర్లు శరీర బరువులో కొంత భాగాన్ని మోస్తాయి. అంటే.. ఇవి సుమారు 50 కిలోల బరువు వరకు మోయగలవన్నమాట. ఎత్తుకు ఎగిరే ఆటలు, వినోదం కోసం, ఎగుడు దిగుడు నేల లేదా అడ్డంకులను దాటడానికి దీన్ని తయారుచేశారట పరిశోధకులు. రద్దీగా ఉండే రోడ్లను దాటడానికి ఇదేదో బాగుందనిపిస్తోంది కదూ!
ఈ వార్తలు కూడా చదవండి:

