అమరావతి, ఆగస్టు 11: స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.
కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఖుదీరామ్ బోస్ ప్రాణత్యాగం చేశారన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భయంలేకుండా పోరాడిన వీరుడు ఖుదీరామ్ బోస్ అంటూ కొనియాడారు. ఆయన ధైర్యం, దేశభక్తి.. యువతకు నేటికీ ఆదర్శమని వ్యాఖ్యానించారు.
స్వతంత్ర భారతాన్ని చూడలేకపోయినా.. ఆయన త్యాగం స్వాతంత్ర్యానికి బలమైన పునాదిగా నిలిచిందని పవన్ పేర్కొన్నారు. మాతృభూమిపై ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఖుదీరామ్ బోస్ జీవితం చాటిచెబుతోందన్నారు. దేశ యువతలో ధైర్యం, దేశభక్తి, మాతృభూమిపై అంకితభావాన్ని ఖుదీరామ్ బోస్ పేరు ఎల్లప్పుడూ ప్రేరేపిస్తుందని తెలిపారు. 'భరతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్. జై హింద్' అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.

