Dailyhunt
భర్తపై అనుమానం.. ట్రాఫిక్‌లో కారు నిలబెట్టి టాంటాం చేసేసింది..!

భర్తపై అనుమానం.. ట్రాఫిక్‌లో కారు నిలబెట్టి టాంటాం చేసేసింది..!

ముంబై: తన భర్త వేరొక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్టు అనుమానించిన ఓ మహిళ నడిరోడ్డుపై అతడి కారు నిలబెట్టి నానా హంగామా సృష్టించింది. దీంతో ముంబైలోని పెద్దార్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో వైరల్‌గా మారింది. దీనిపై ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ.. సదరు మహిళ తన భర్తకు చెందిన రేంజ్ రోవర్ కారును వెంబడిస్తూ వచ్చినట్టు వెల్లడించారు. భర్త కారులో ఉన్న మరో మహిళతో అతడికి అక్రమ సంబంధం ఉన్నట్టు ఆమె ఆరోపించిందని తెలిపారు. ఓ సిగ్నల్ వద్ద రోడ్డుపై అతడి కారును అడ్డుకున్న ఆమె.. తన వాహనంలో నుంచి బయటికి వచ్చి భర్తను బయటికి రావాలంటూ డిమాండ్ చేసింది.

కారు బోనెట్ మీదికి ఎక్కి చెప్పుతో కొడుతూ, కేకలు వేస్తూ ఆగ్రహంతో ఊగిపోయింది.

భర్త కారు దిగడంతో ఆమె అతడిని జుట్టుపట్టుకుని కాళ్లతో తన్నినట్టు పోలీసులు తెలిపారు. ఇంతలో అతడి కారులో ఉన్న ఇంకో మహిళ అదే కారులో అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో సిగ్నల్ పడడంతో ఆమెను కూడా బయటికి లాగి కొట్టేందుకు ప్రయత్నించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకుని ఆ ముగ్గుర్నీ వాహనాలతో సహా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ''శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు సదరు మహిళకు చలాన్ జారీ చేశాం...'' అని ట్రాఫిక్ ఏసీపీ ప్రవీణ్ పద్వాల్ వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy