Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భోగాపురం: ప్రవాసాంధ్రుల కర్తవ్యం

భోగాపురం: ప్రవాసాంధ్రుల కర్తవ్యం

ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు అభివృద్ధికి ఒక సంకేతంగా మారుతున్నాయి. వాటికి నెలవు అయిన ప్రాంత సమగ్ర పురోగతికి అవి క్రమేణా ప్రధాన ఆలంబనగా నిలుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేక ఆశలు రేకెత్తిస్తోంది.

విమానాశ్రయాలు అభివృద్ధికి ఏ విధంగా దోహదం చేస్తాయన్నదానికి దుబాయి, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలే నిదర్శనాలు. చమురు ఆదాయం అంతంత మాత్రంగా ఉండే దుబాయి నేడు విశ్వవిఖ్యాత నగరంగా ఎదగడానికి ముఖ్య కారణం విమానాశ్రయమనే విషయాన్ని ఎవరూ విస్మరించకూడదు. అదేవిధంగా హైదరాబాద్ ఆర్థిక వికాసంలో శంషాబాద్, మలబార్‌ మహర్దశలో కాలికట్ విమానాశ్రయాల పాత్రను వేరు చేసి చూడలేం. సుదూర గమ్యస్థానాలకు అనువైన అనుసంధానం, సమీప ప్రాంతాల వారి రాకపోకలు, వాణిజ్యావకాశాలు మొదలైనవి ఈ పురోగతిలో ముఖ్య భూమిక వహించాయి. దుబాయి మీదుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నగరానికీ విమానయాన సదుపాయం అందుబాటులోకి రావడానికి ముందు కూడా ఇరుగు పొరుగు దేశాల నుంచి కార్మిక వలసలు దుబాయి అభివృద్ధిలో కీలకం. అలాగే శంషాబాద్‌, కాలికట్ విమానాశ్రయాల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రవాసుల రాకపోకలతో తెలంగాణలో ఐటీ, కేరళలో పర్యాటక రంగం గణనీయంగా వృద్ధి చెందాయి.

ఉత్తరాంధ్ర, ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి విదేశీ వలసలు అనాదిగా ఉన్నాయి. బతుకుదెరువు వలసలకు తెలంగాణ పెట్టింది పేరు. అయితే ఇరవయో శతాబ్ది తొలినాళ్లలోనే ఉత్తరాంధ్ర ప్రాంతమైన సిక్కోలు ఉపాధి వలసలకు ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ దేశాలలో చమురు నిక్షేపాలను కనుగొనడానికి పూర్వమే బర్మాలో చమురు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది బర్మాకు వలసపోయి చమురు పరిశ్రమలో ఉపాధి పొందారు. ప్రపంచ నౌకా రవాణా, గల్ఫ్‌లోని చమురు పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న నిపుణులలో ఎల్లప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతీయులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో తమ ప్రాంతం రూపురేఖలు మారగలవనే ఆశాభావం ఉత్తరాంధ్ర ప్రవాసులలో నిండుగా ఉన్నది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించి నిర్వహిస్తున్న జి.యం.ఆర్ సంస్థ విమానాశ్రయాల నిర్వహణలో భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో గర్వించదగ్గ సంస్థలలో ఒకటి.

వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించి విమానాశ్రయాల నిర్మాణ నిర్వహణల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధుడైన గ్రంథి మల్లికార్జునరావు తన పేర నెలకొల్పిన జి.యం.ఆర్ సంస్థ హైదరాబాద్, న్యూఢిల్లీ విమానాశ్రయాలను నిర్మించిన తీరు అపూర్వమైనది. టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయ నిర్మాణంలో కూడా జి.యం.ఆర్ సంస్థ కీలక భాగస్వామి. అదేవిధంగా, లక్షలాది యాత్రికులు సందర్శించే మదీనాలోని విమానాశ్రయ అభివృద్ధికి సౌదీ అరేబియా ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థలలో ఇది కూడా ఒకటి.

ఈ రకమైన ఘనకీర్తి ఉన్న జి.యం.ఆర్ భోగాపురంలో ఆసక్తి చూపడం భావోద్వేగ సంబంధమని చెబుతారు. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల నిర్మాణం, నిర్వహణలో ఆసక్తి చూపిన జి.యం.ఆర్ అహ్మదాబాద్ విమానాశ్రయం విషయంలో అదానీ గ్రూప్‌తో పోటీ పడింది. అయితే, అది అదానీ సంస్థకే దక్కింది. అదానీ ఒక దశలో భోగాపురం విషయంలో ఆసక్తి చూపినా వ్యాపార సూత్రాల కంటే జి.యం.ఆర్‌కు ఈ ప్రాంతంతో ఉన్న మమకారం కారణాన వెనక్కు తగ్గక తప్పలేదు. దీనికి తగినట్లుగా విమానాశ్రయ ప్రారంభోత్సవం రోజున గ్రంథి మల్లికార్జునరావులో ఆనందభరిత హావభావాలు కనిపించాయి.

భోగాపురం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు ఒక్కొక్కరూ రూ. 1,255, వచ్చేవారు రూ. 545 రుసుంను చెల్లించవల్సి ఉంటుంది. దేశీయ ఆగమనాల రుసుం కూడా ఎక్కువే. ఇది హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీలలో కంటే ఎక్కువే. తను పుట్టిన ప్రాంతానికి సేవ చేసే ఉద్దేశంతో జి.యం.ఆర్ అధినేత భోగాపురం ప్రాజెక్టును దక్కించుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారానికి భిన్నమైన రీతిలో ఈ రుసుం ఉన్నది. మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు లాంఛనంగా ప్రారంభం కానుండగా అందులో దుబాయి విమానానికి చోటు లేదు. అదే సందర్భంగా గౌహతి- దుబాయి విమాన సర్వీసుకు అన్ని ఏర్పాట్లు పూర్తికావడం ఇక్కడ గమనార్హం.

కేరళలోని కాలికట్, కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధిలో మలయాళీ ప్రవాసుల పాత్ర ప్రముఖమైనది. వారి సహాయం లేకపోతే ఆ విమానాశ్రయాల పురోగతి సాధ్యమయ్యేది కాదు. అటువంటి స్ఫూర్తిని ప్రవాసాంధ్రులు కూడా భోగాపురం విమానాశ్రయంలో ప్రదర్శించవల్సిన తరుణం ఇది. ప్రభుత్వం కూడా విమాన ఇంధనం పన్నుపై రాయితీ ప్రకటించి ప్రోత్సహించాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy