ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 20: బీహార్‌లోని బీహార్ షరీఫ్‌లో ప్రముఖ భోజ్‌పురి నటి కాజల్ రాఘవానీకి చేదు అనుభవం ఎదురైంది. ఒక జువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెను చూసేందుకు అభిమానులు, జనం ఒక్కసారిగా భారీగా తరలివచ్చారు.
దాంతో అక్కడ తీవ్ర గందరగోళం, తోపులాట చోటుచేసుకున్నాయి.
నటి షోరూమ్ నుంచి బయటకు వచ్చి తన కారులో వెళ్తుండగా, ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో జనం కారు వెనుక పడ్డారు. అంతేకాకుండా కారుపై రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు. షాపు దగ్గర బీభత్సం సృష్టించారు.
ఈ సంఘటన సోషల్ మీడియాలో కలకలం రేపడంతో, తన క్షేమం కోరుతూ కాల్స్ చేస్తున్న అభిమానుల కోసం కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మేమందరం సురక్షితం.. 'నేను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాను. నా టీమ్‌లోని ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ఫోన్లు చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మీ అందరి ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను' అని కాజల్ స్పష్టం చేశారు.
చిన్న వయసులోనే గుజరాతీ చిత్రాలతో నటన ప్రారంభించిన కాజల్, 2013లో 'రిహాయ్' చిత్రంతో భోజ్‌పురి చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇప్పటివరకు 50కి పైగా సినిమాల్లో నటించిన ఆమె, 'పట్నా సే పాకిస్తాన్', 'మెహందీ లగా కే రఖ్నా', 'సంఘర్ష్' వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె 'రైజ్ అండ్ ఫాల్ 2'లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

