Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్

బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు.

బిహార్‌కు చెందిన వైభవ్.. గతేడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆడిన మూడో మ్యాచ్‌లోనే 35 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఈ సీజన్‌లోనూ 36 బంతుల్లో శతక్కొట్టాడు. సంచలన ఆటతో అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న వైభవ్.. ఆరెంజ్ క్యాప్ రేసులోనూ ఉన్నాడు. అయితే ఇలాంటి ఆటగాడు వచ్చిన బిహార్‌కూ ఓ ఐపీఎల్ జట్టు ఉండాలని బిలియనీర్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. భారత్‌లోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటైన వేదాంతా గ్రూప్‌నకు ఆయన ఛైర్మన్. కాగా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లా బిహార్‌కు కూడా అద్భుతమైన జట్టు ఉండాలి కదా? బిహార్ గడ్డ ఎంతో మంది నాణ్యమైన క్రికెటర్లను దేశానికి అందించింది. పట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ చేశాడు. సమస్తిపుర్ నుంచి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగ్రేటంలోనే రికార్డులు సృష్టించాడు. సాకిబ్ హుస్సేన్(ఎస్ఆర్‌హెచ్) గోపాల్‌గంజ్‌లోని ఓ సాధారణ కుటుంబానికి చెందిన ప్లేయర్. ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు ఒకటే అనిపించేది. ఎందుకు క్రికెట్‌లో బిహార్‌కు గుర్తింపు రావడం లేదు? బిహార్ యువత ప్రతి రంగంలోనూ రాణించేలా అవకాశాలు కల్పించి.. మన క్రీడాకారులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం అందించేలా చేయడం నా చిరకాల కోరిక. బిహార్ నుంచి వచ్చే జట్టు ప్రపంచంలోనే అత్యత్తుమ జట్టుగా నిలుస్తుందన్న పూర్తి నమ్మకం నాకుంది' అని అనిల్ అగర్వాల్ పోస్టులో పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy