కోల్‌కతా: మరో రెండ్రోజుల్లో ఫల్తా నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగనున్న తరుణంలో టీఎంసీ (TMC) అభ్యర్థి జహంగీర్ ఖాన్ (Jahangir Khan) తన నామినేషన్‌ను మంగళవారంనాడు ఉపసంహరించుకోవడం సంచలనమైంది.
దీనిపై టీఎంసీ తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడింది. బీజేపీ ఒత్తిడి రాజకీయాలే ఇందుకు కారణమని మండిపడింది. జహంగీర్ ఖాన్ వ్యక్తిగత హోదాలో ఈ నిర్ణయం తీసుకున్నారని, పార్టీ నిర్ణయం కాదని పేర్కొంది.
మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి టీఎంసీ కార్యకర్తలు, మద్దతుదారులపై బెదిరింపు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని, గత కొద్ది వారాల్లోనే 100 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారని టీఎంసీ ఆరోపించింది. ఫల్తా ఏరియాలోని పార్టీ సంస్థాగత నెట్‌వర్క్‌పై దాడులకు బీజేపీ పాల్పడుతోందని పేర్కొంది. కార్యాలయాలను ధ్వంసం చేయడం, బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, మూసివేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని పేర్కొంది.
'మా పార్టీ కార్యకర్తలు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. అయినా సంయమనం కోల్పోకుండా ఏజెన్సీలు, ప్రభుత్వ యంత్రాంగంతో బీజేపీ చేయిస్తున్న బెదిరింపులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఒత్తిడికి గురై ఎన్నికల పోరాటానికి దూరంగా ఉండిపోతున్నట్టు మా దృష్టికి వచ్చింది' అని టీసీఎం ఆ ప్రకటనలో పేర్కొంది. 'బంగ్లా విరోధి' బీజేపీపై ఇటు బెంగాల్‌లోనే కాకుండా ఢిల్లీలో జాతీయ స్థాయిలో అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేసింది.
రీపోలింగ్
ఏప్రిల్ 29న జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్‌లో పలు అవకతవకలు జరిగినట్టు ఎన్నికల కమిషన్ గుర్తించింది. దీంతో ఫల్తా నియోజకవర్గంలోని 286 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలిచ్చింది. దీంతో మే 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. మే 24న ఫలితాలు ప్రకటిస్తారు.

