Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బీజేపీ నేత యోగానంద్ పాదయాత్ర

బీజేపీ నేత యోగానంద్ పాదయాత్ర

హైదరాబాద్: ప్రజాసమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి, మొద్దు నిద్ర నుంచి కేసీఆర్ సర్కారును నిద్ర లేపుతామంటూ శేరిలింగంపల్లి నియోజక వర్గం బీజేపీ ఇంచార్జి యోగానంద్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని అన్ని డివిజన్లలో ఈ యాత్ర విడతల వారీగా సాగనుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలూ ఈ యాత్రలో పాల్గొంటారని చెప్పారు. ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా యోగానంద్ విజ్ఞప్తి చేశారు. పాదయాత్ర కరపత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ప్రజాసమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని, చెరువులు కూడా కబ్జా అవుతున్నాయని ఆరోపించారు.

అధికార పార్టీ నాయకుల కనుసన్నలలోనే కబ్జాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని యోగానంద్ విమర్శించారు. రోడ్లు పాడైపోయి గుంతలుపడ్డాయని, మ్యాన్ హోల్స్ ఎక్కడికక్కడ తెరుచుకుని ఉన్నాయన్నారు. వర్షం వస్తే బస్తీలన్నీ జలమయం అయ్యాయని, పేదలకు నీడ కరువైందని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలకు వైద్యం లేదని, సర్కారు విద్య అందడమే లేదన్నారు. ఈ కార్యక్రమంలో యోగానందతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు బి.అశోక్,శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షులు రాజు శెట్టి, కొండాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు జయరాములు,బీజేపీ యువ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ జితేందర్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy