Dailyhunt
బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ

బీటెక్ విద్యార్థులను సైబర్ క్రైమ్‌లోకి ముఠాలు లాగుతున్నాయి: రాయపాటి శైలజ

విజయవాడ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మనుషుల అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)పై అవగాహన పెంచేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ (Rayapati Sailaja) కీలక కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఈ నేపథ్యంలో శైలజ నేతృత్వంలో రైల్వే పోలీసులతో కలిసి విజయవాడలో ఈరోజు (శుక్రవారం) ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫికింగ్‌పై ప్రజల్లో అవగాహన పెంపుతో పాటు, గుర్తింపు విధానాలపై కూడా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే డివిజనల్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, ముఖ్యంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాయపాటి శైలజ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడుకు చెందిన పీఎం నాయక్ హాజరయ్యారని పేర్కొన్నారు.

సోషల్ మీడియా ద్వారా యువతను టార్గెట్ చేస్తున్నారు...

ట్రాఫికింగ్ అంటే.. ఒకే రకమైన నేరం కాదని, ఇది అనేక రూపాల్లో జరుగుతుందని రాయపాటి శైలజ వ్యాఖ్యానించారు. విద్యార్థులను విదేశాలకు పంపిస్తామని చెప్పి మోసం చేస్తున్నారని తెలిపారు. పలు మార్గాల్లో ట్రాఫికింగ్ జరుగుతుంతోందని వెల్లడించారు. ముఖ్యంగా, బాధితులను గుర్తించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ట్రాఫికింగ్ మాఫియా తమ విధానాలను మార్చుకుంటున్నాయని, సోషల్ మీడియా ద్వారా కూడా యువతను టార్గెట్ చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులను విదేశాలకు తీసుకెళ్లి, వారిని సైబర్ నేరాల్లో పాల్గొనేలా చేస్తున్నారన్నారు. ఇది సాధారణంగా కనిపించని కొత్త రకం ట్రాఫికింగ్ అని, దీనిపై ప్రత్యేక అవగాహన అవసరమని తెలిపారు.

సైకలాజికల్ అవగాహన అవసరం

ట్రాఫికింగ్ బాధితులను గుర్తించడం మాత్రమే కాకుండా, వారిని సైకలాజికల్‌గా ఎలా డీల్ చేయాలో కూడా ఈ కార్యక్రమంలో వివరించామని రాయపాటి శైలజ పేర్కొన్నారు. బాధితులు మానసికంగా చాలా ఒత్తిడిలో ఉంటారని, అందుకే వారికి సహాయం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో రోబోటిక్ సిస్టమ్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది భవిష్యత్తులో ట్రాఫికింగ్‌ను అరికట్టడంలో కీలక పాత్ర పోషించవచ్చని అభిప్రాయపడ్డారు. కేవలం పోలీసులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలని.. సోషల్ మీడియాలో అపరిచితులతో సంబంధాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇలా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటే ట్రాఫికింగ్‌ను తగ్గించవచ్చని చెప్పారు. గతంతో పోలిస్తే ట్రాఫికింగ్ కేసులు కొంతవరకు తగ్గాయని వివరించారు. అయితే, కొత్త పద్ధతులు వెలుగులోకి వస్తున్నందున నిరంతర అవగాహన అవసరమని రాయపాటి శైలజ స్పష్టం చేశారు.

.

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy