బ్రసిలియా: కరోనా మహమ్మారి బ్రెజిల్‌ను వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 24,831 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 18,64,681కు చేరింది. ఇదిలా ఉంటే.. శనివారం బ్రెజిల్‌లో 39 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో తాజాగా నమోదైన కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. కేసుల విషయంలోనే కాకుండా మరణాల సంఖ్యలోనూ ఆదివారం తగ్గుదల కనిపించింది. శుక్రవారం దేశంలో కరోనా కారణంగా 1200 మంది చనిపోతే.. శనివారం 1071 మంది మృతిచెందారు. అయితే ఆదివారం మాత్రం ఈ సంఖ్య దాదాపు 650లోపే ఉన్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. బ్రెజిల్‌లో ఆదివారం చనిపోయిన వారితో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 72,100 మంది మృత్యువాతపడ్డారు.

