Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బువ్వగింజల మోపు

బువ్వగింజల మోపు

గెనంగట్టు మీద నాయిన కొడవలి భుజానేసుకొస్తుంటే

బువ్వకుండ నడిచొస్తా ఉన్నట్లనిపించేది

గుంటబాయి నించి యాతంతో నీళ్ళు తోడిపోస్తుంటే

తొలకర్లు చిలకరించే వానదేవుడిలా అవుపడేటోడు

చెంగోవాలు కట్టి చాడేసిన కయ్యల్లో

మెరుస్తూ తిరిగే పొద్దప్పతో పోటీపడి

పరుగుతీసే నాయినను పలకరిస్తే

పొద్దుతిరుగుడు పువ్వులా

పచ్చపచ్చంగా నవ్వేటోడు

వరికంకుల నడమ నిలబడుకోని

పదేపదే చేతులూపతా ఉంటే

గెడకర్రకు బోర్లించిన సున్నంబొట్లకుండ మాదిరి

దిష్టిబొమ్మ ఆయ్యేటోడు

కయ్యల్లో కలతిరగతా కొన్ని ఆశల విత్తనాలుగూడా జెల్లి

తాకట్టులో ఉన్న ఆలి తాళిబొట్టు ఇడిపించాలి

అమ్మికి పూలపూలగౌను కొనాలి అనుకుంటా

పగటికలలు కనేటోడు

ఓ తూరి కరువమ్మ మరోతూరి వరదమ్మ

కళ్ళెర్ర చేస్తే ఆశలవిత్తులన్నీ కన్నీళ్ళలో కొట్టకపాయె

పిడేటిగొట్టి తూర్పారబట్టిన తాలుగింజల్లా కలలన్నీ కల్లలైపాయే

ఓ చేత్తో కొడవలి మరోచేత్తో పుస్తకం నెత్తిమీద గుడ్డలమూటతో

పట్నానికి వలసొచ్చినా

ఐదు రోజులు గుమస్తాగిరి

రెండు రోజులు బువ్వమ్మ చెంత ఎగుసాయం

ఇరు భుజాల మీద మోస్తున్న సవ్యసాచి

బతుకుకలలు కంటూ నడిచొచ్చే

బువ్వగింజల మోపు మా నాయిన

- రోహిణి వంజారి

90005 94630

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy