శిక్షణకు పిలిచారు.. ఖర్చులు మరిచారు
అంగన్వాడీలకు అరకొర చెల్లింపులు
అందని స్నాక్స్, టీఏ ఖర్చులు
డీఆర్పీలకూ అంతే సంగతులు
ఉన్నతాధికారులు స్పందించాలని వినతి
మెంటాడ, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కార్యకర్తలకు ఈనెలలో రెండు విడతలుగా 'జ్ఞాన జ్యోతి'పై శిక్షణ ఇచ్చారు. హాజరైనందుకు అయిన ఖర్చులు మాత్రం ఇప్పటికీ చెల్లించలేదు. ఆ నిధుల్లో అధికారులు చేతివాటం చూపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆటలు ఆధారిత బోధన, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారీ, బొమ్మలు..
సంజ్ఞల ద్వారా చిన్నపిల్లలకు సులభంగా అర్థమయ్యేలా విద్యను అందించడం జ్ఞాన జ్యోతి ఉద్దేశం. మండలంలోరి 75మంది అంగన్వాడీలకు ఈనెలలో మూడురోజులు వంతున రెండు విడతల్లో ఆరురోజులు శిక్షణ ఇచ్చారు. తరగతులకు హాజరైన అంగన్వాడీలకు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం కోసం 200 రూపాయలు, 50 రూపాయల రవాణా ఖర్చుతో పాటు ట్రైనింగ్ మెటీరియల్ కాస్ట్ కింద రోజుకు 148 రూపాయలు, స్టేషనరీ కింద 99 రూపాయిలు చొప్పున చెల్లించాలని ప్రభుత్వం నూచించింది. అయితే మధ్యాహ్న భోజనం కింద ఒకరోజు 200 రూపాయలు మాత్రమే చేతిలో పెట్టారని, మిగిలిన రోజులమాటేమిటని అడిగితే స్వయంగా భోజనం తెప్పించి ఇచ్చామని చెప్పుకొస్తున్నారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు మించి తమకు ఏ నిధులూ ఇవ్వలేదని, టీఏ...ట్రైనింగ్ మెటీరియల్ కాస్ట్ కింద 148, స్టేషనరీ కింద 99 రూపాయలు కూడా ఇవ్వలేదని, అడిగితే ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని బుకాయిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎంతో దూరం నుంచి ఇక్కడకు వస్తే కనీసం టీఏ కూడా ఇవ్వకపోవడం అన్యాయమని వాపోతున్నారు. మరోవైపు వీరికి శిక్షణ ఇచ్చిన డీఆర్పీలకూ శఠగోపం పెట్టారని చెబుతున్నారు. వీరికి రోజుకి 200 రూపాయలు చొప్పున ఆరు రోజులకు 1200 ఇవ్వాల్సి ఉండగా, మంగళవారం చివరిరోజున చేతిలో రూ.500 పెట్టి వెళ్లిపొమ్మనడం ఎంతవరకు న్యాయమని డీఆర్పీలు వాపోతున్నారు. మొత్తం అంగన్వాడీలు, డీఆర్పీలకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన దాంట్లో సుమారు లక్ష రూపాయల వరకు కోతపెట్టారని, గజపతినగరం ప్రాజెక్టు పరిధిలో సుమారు 2000 మందికి శిక్షణ ఇచ్చారని, ఆ డబ్బు ఎటు వెళ్లిందని ప్రశ్నిస్తున్నారు. ఉన్నాతాధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు.

