Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చదువుకోవాలని ఉంది.. సారూ!

చదువుకోవాలని ఉంది.. సారూ!

ఉపాధ్యాయులు లేక తెరుచుకోని ఐదు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు

రోజూ స్కూళ్లకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్న గిరిజన బాలలు

విద్యకు దూరమై ఆటలకే పరిమితం

విద్యార్థి మిత్ర కిట్లు సైతం అందని వైనం

విద్యాశాఖాధికారులకు విన్నవించుకున్నా స్పందించలేదని తల్లిదండ్రుల ఆవేదన

గూడెంకొత్తవీధి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఐదు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించకపోవడంతో ఇప్పటికీ అవి తెరుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేసే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు ఇప్పటికీ వారికి చేరలేదు. విద్యార్థులు కేవలం మధ్యాహ్న భోజనాలకు పాఠశాలలకు వచ్చి వెళ్లిపోతున్నారు. పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

గూడెంకొత్తవీధి మండలంలోని కొండపల్లిపాడు, గూడెం తీములబంద, చిన్న అగ్రహారం, రాసకోట, వలసపల్లి గ్రామాల్లో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. కొండపల్లిపాడు పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి చదివే విద్యార్థులు 52 మంది, ఇతర పాఠశాలల్లో 35- 35మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఐదు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు రెండేళ్లగా భర్తీ కాలేదు. గత ఏడాది ఇతర పాఠశాలల నుంచి ఒక్కొక్క ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై నియమించి విద్యాబోధన కొనసాగించారు. వాస్తవానికి పాఠశాలల పునఃప్రారంభానికి ముందుగానే ఉపాధ్యాయులు లేని పాఠశాలలను గుర్తించి డిప్యూటేషన్‌పై నియామకాలు చేపట్టాల్సి వుంది. అయితే పాఠశాలలు పునఃప్రారంభమై ఏడు రోజులు గడుస్తున్నప్పటికి విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు మండల పరిషత్‌, విద్యాశాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకు వెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం విద్యార్థులు రోజూ ఉదయం ఉపాధ్యాయుడు వస్తారేమోనని ఆశగా పాఠశాలకు వస్తున్నారు. మధ్యాహ్నం వరకు నిరీక్షించి భోజన పథకం నిర్వాహకులు సిద్ధం చేసిన ఆహారం తీసుకుని వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది ఒకటవ తరగతిలో చేరాల్సిన విద్యార్థులను సైతం చేర్చుకునే ప్రక్రియ ప్రారంభంకాలేదు. విద్యార్థులు చదువుకు దూరమై ఆటలకు పరిమితమయ్యారు. ఇప్పటికైనా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఐదు పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించి విద్యాబోధన ప్రారంభించాలని విద్యా కమిటీ చైర్మన్‌ కొర్ర లింగేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy