జాతీయం-అంతర్జాతీయం
చైనా దుర్బుద్ధిపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
గ్రామం నిర్మించిన ప్రాంతం మాదే: చైనా
గువాహటి, జనవరి 21: అరుణాచల్‌ప్రదేశ్‌లోని డపోరిజి పట్టణంలో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ సరిహద్దుకు 4.5కిలోమీటర్ల లోపల భారత్ వైపు.. అరుణాచల్‌లోని సుబాన్సిరి జిల్లాలో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిన విషయం విదితమే. దీనిపై అరుణాచల్‌లోని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. కొన్ని వర్గాల ప్రజలతో కలిసి ధర్నా, ర్యాలీ నిర్వహించాయి. 'భారత్ మాతాకీ జై.. మేం భారతీయులం' అంటూ నినాదాలు చేశాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మను దహనం చేశాయి. నిరసనల్లో.. రాష్ట్రంలో పెద్దదైన విద్యార్థి సంఘం ఆల్ అరుణాచల్‌ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్(ఏఏపీఎ్‌సయూ)తోపాటు ఆల్ ట్యాగిన్ యూత్ ఆర్గనైజేషన్, ఆల్ గిబా సర్కిల్ విజిలెన్స్ ఫోరం, న్యూ మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ తదితర సంస్థలు, వ్యక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. గ్రామాన్ని తమ భూభాగంలోనే నిర్మించుకున్నామంటూ చైనా తన దుర్బుద్ధిని మరోమారు బయటపెట్టుకుంది.