Sunday, 24 Jan, 10.47 am ఆంధ్రజ్యోతి

నవ్య
'చంపారన్‌ మసాలా'... మజాకా

మాంసాహారులకు మరో మహారుచి 'చంపారన్‌ మటన్‌ కర్రీ'. బిహారీలకు అత్యంత ఇష్టమైన ఈ రుచికి కేరాఫ్‌గా పట్నాలోని 'ఓల్డ్‌ చంపారన్‌ మీట్‌ హౌస్‌'ను చెబుతారు భోజనప్రియులు. ఎక్కడో బిహార్‌, నేపాల్‌ సరిహద్దుల్లోని 'చంపారన్‌' రుచులను రీ క్రియేట్‌ చేశారు రవికుమార్‌ ఖుష్‌వాహా....

'ఓల్డ్‌ చంపారన్‌ మీట్‌ హౌస్‌' అంటే బీహార్‌ రాజధాని పట్నాలో తెలియని వారుండరు. పట్నాకు వెళ్లినవారు చంపారన్‌ మాంసం రుచి చూడకుండా ఉండరు. అక్కడి ప్రత్యేకమైన మటన్‌ మసాలా రుచి మరెక్కడా ఉండదని అంటారు భోజనప్రియులు. అందులో తయారయ్యే 'మటన్‌ మండీ' లేదా 'అహునా మటన్‌'ను తీసుకెళ్లడానికి జనం క్యూలు కడతారు. దాని యజమాని గోపాల్‌కుమార్‌ ఖుష్‌వాహా రెండేళ్ల పాటు తాము తయారుచేస్తున్న 'బీఎంహెచ్‌' (బికెఏపీ మటన్‌ హబ్‌) మ్యాజిక్‌ మసాలాను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా అమ్మాలని ప్రయత్నించారు. కానీ ఆయా సంస్థలు ఆయన విన్నపాన్ని అప్పట్లో ఏమాత్రం పట్టించుకోలేదు. 2014లో ఫుడ్‌ బిజినెస్‌లోకి వచ్చిన 42 ఏళ్ల గోపాల్‌కుమార్‌ ప్రారంభంలో చాలా పోటీ ఎదుర్కొన్నాడు. అయితే నాన్‌వెజ్‌కు అవసరమైన 32 మసాలాలను 'బీఎంహెచ్‌' మ్యాజిక్‌ మసాల పేరిట అమ్మడం మొదలెట్టాక ఆయన దశ తిరిగింది.

ప్రత్యేకత ఇదే...

'చంపారన్‌ మటన్‌ కర్రీ' అంటే బిహారీలకు బాగా ఇష్టం. 'మట్కాఘోష్‌'గా కూడా పేర్కొనే దీన్ని కుండలో వండుతారు. కుండ బిర్యానీలాగే కుండ మటన్‌ అన్నమాట. బిహార్‌, నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న చిన్న గ్రామం తూర్పు చంపారన్‌. అక్కడ మటన్‌ను గిన్నెలో కాకుండా కుండలో వండుతారు. ఆ విధానాన్నే మెరుగుపరిచి గోపాల్‌కుమార్‌ 'అహునా మటన్‌'ను తయారుచేశారు. 'ఓల్డ్‌ చంపారన్‌ మీట్‌ హౌస్‌' పేరిట రెస్టారెంట్‌ ప్రారంభించి క్రమక్రమంగా పాపులర్‌ చేశారు. పట్నాలో దీనికి చైన్‌ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అయితే ఆ రుచులను ప్రపంచవ్యాప్తం చేయాలనే కోరిక ఆయనలో బలంగా ఉండేది. అయితే గత ఏడాది లాక్‌డౌన్‌ ప్రభావం ఈ రెస్టారెంట్లపై కూడా పడినప్పటికీ సరికొత్త దారులు తెరుచుకున్నాయి. 'బీఎంహెచ్‌' మసాలాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. దాంతో 'అమెజాన్‌', 'ఫ్లిప్‌కార్ట్‌' వంటి ఈ కామర్స్‌ సంస్థలు ఈ మసాలాలను కూడా లిస్ట్‌లో పెట్టాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఈ మసాలా బాక్సులు లక్షకు పైగా అమ్ముడయ్యాయి. ఎవరెస్ట్‌, టాటా, క్యాచ్‌ వంటి పాపులర్‌ బ్రాండ్లకు చెందిన మీట్‌ మసాలాల పోటీని తట్టుకుని నిలబడ్డాయి. ''టీ కాయడమంత సులువుగా మా మసాలాలతో మటన్‌ వండుకోవచ్చు. ఇది నేను మాంసం ప్రియులకు ఇస్తున్న భరోసా. అదే జరగకపోతే నా జీవితం వృథా'' అని నమ్మకంగా చెబుతున్నారు అనిల్‌కుమార్‌. విశేషమేమిటంటే మసాలా బాక్సులపై తనతో పాటు, తన భార్య ఫోన్‌ నెంబర్లు కూడా ఇచ్చారాయన. కస్టమర్లకు ఏవైనా సందేహాలుంటే వివరణ ఇచ్చేందుకే ఇద్దరి ఫోన్‌ నెంబర్లు ఇచ్చారట.

అవే మసాలాలు... అవే రుచులు...

లాక్‌డౌన్‌కు ముందు 'ఓల్డ్‌ చంపారన్‌ మీట్‌ హౌస్‌' ఔట్‌లెట్‌ను ఢిల్లీ శివారుల్లోని నోయిడా సెక్టార్‌ 15లో కూడా ప్రారంభించారు. అయితే ఫ్రాంఛైసీలు మటన్‌ తయారీలో కచ్చితంగా ఉన్న నియమాలను పాటించకపోవడంతో అసంతృప్తికి గురైన రవికుమార్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌, స్మోక్‌ డిటెక్టర్స్‌ ఉండే 'భట్టీ'లను రూపొందిస్తున్నారు. వీటితో రుచిలో ఏమాత్రం తేడా రాదు. ''బిహార్‌ బయట మా రుచులను పరిచయం చేయాలంటే ఇలాంటివి తప్పవు. సిమెంట్‌ మిక్సర్‌ లాంటి మిక్సర్‌లో ఒకేసారి రెండు లక్షల మందికి అవసరమైన మటన్‌ను వండటానికి రెడీ చేయొచ్చు. వాటిపై పేటెంట్‌ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నా'' అన్నారు గోపాల్‌. ఒకవైపు మసాలాల తయారీలో బిజీగా ఉంటూనే ఈ బృహత్‌ ప్రణాళికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారాయన. ''నా మసాలాలు, మెషీన్లతో ఒకవేళ వర్కర్లు రాకున్నా, రెస్టారెంట్లు సాఫీగా నడుస్తాయి. నేను మనదేశపు 'కెఎఫ్‌సీ'ని కావాలని కలలు కంటున్నా'' అంటున్నారు గోపాల్‌.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top