విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మృతులకు ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదాయం కోల్పోయిన వారికి రూ. 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. 10 డిమాండ్లతో ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన తహసీల్దార్ కార్యాలయాలల్లో , 18వ తేదీన రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, 20వ తేదీన కలెక్టర్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని తీర్మానం చేశారు.
అలాగే ఈ నెల 22వ తేదీన 175 నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించారు. మాన్సాస్ ట్రస్టు విషయంలో హైకోర్టు తీర్పుపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. పన్నుల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 15, 16వ తేదీల్లో అఖిలపక్ష పార్టీల నిరసనకు సంఫీుభావం తెలిపారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందు తయారీలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సమావేశంలో టీడీపీ నాయకులు ఖండించారు.

