Sunday, 26 Sep, 3.09 am ఆంధ్రజ్యోతి

ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
చట్టంతో స్మార్ట్‌ గేమ్‌

ఎయిడ్‌ ఆపివేత, విద్యేతర అవసరాలకు

భూవినియోగం రెండూ రూల్స్‌ ఉల్లంఘనే

తానుఇచ్చిన గెజిట్‌కే రాష్ట్ర ప్రభుత్వం తూట్లు

(అమరావతి, ఆంధ్రజ్యోతి): 'ఎయిడెడ్‌ సంస్థల విషయంలో స్మార్ట్‌గా వ్యవహరిస్తున్నారు' అంటూ అధికారులను ఉద్దేశించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు...'మేం మరింత స్మార్ట్‌గా ఉండగలం' అన్న హెచ్చరికలు ఇప్పుడు విద్యారంగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎయిడెడ్‌ కళాశాలలు తమ ఆస్తులతో సహా ప్రభుత్వంలో విలీనం కావాలనీ, లేకుంటే వాటికి సాయం ఆపేస్తామనీ, రెండునెలల్లో విచారణ చేసి ఎయిడ్‌ నిలిపివేస్తామని ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌లో పేర్కొంది. వాస్తవానికి ఎయిడెడ్‌ కళాశాలలకు ప్రభుత్వ సాయం ఏ రూపంలో అందుతుంది అని చూస్తే...అది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బంది తదితరులకు ఇచ్చే జీతాల రూపంలోనే! నగదు రూపంలో సాయం లేదు. జీతాల రూపంలోనే సాయం ఉంది. ఒకవేళ ఆ సాయం ఆపేయాలంటే గెజిట్‌లో చెప్పినట్లుగా రెండునెలల్లో విచారణ చేసి ఆపేయాలి. విద్యాచట్టం 1982 సెక్షన్‌ 46 కూడా అదే చెప్తోంది. కానీ ఎలాంటి విచారణ లేకుండా సిబ్బందిని ప్రభుత్వ కాలేజీల్లోకి విలీనం చేసేస్తున్నారు.అంటే ఎయిడెడ్‌లో ఇప్పుడు తరగతులు చెప్పేందుకు లెక్చరర్లు లేరు.

దశాబ్దాల క్రితం దాతలు ఇచ్చిన స్థలాలు, వారిచ్చిన విరాళాలతో భవనాలు కట్టడంతో ఎయిడెడ్‌ సంస్థలు ప్రారంభమయ్యాయి. దాతల దాతృత్వం, ప్రభుత్వం అందించే జీతాల రూపంలో ఇచ్చే సాయం కలగలిసి విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పేందుకు ఆస్కారం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ విద్యాసంస్థల్లోని సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి తీసేసుకొంటోంది. అంటే సదరు ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు సాయం కట్‌ అయిపోయినట్లే. మరి సాయం ఆపేయాలంటే విద్యాహక్కు చట్టం ప్రకారం రెండునెలల నోటీసు, విచారణ ఏమైనట్లు అనేది వారే చెప్పాలని విద్యానిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై కొన్ని పాఠశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ వ్యాఖ్యాల విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరును హైకోర్టు నిశితంగా ఆక్షేపించింది. అయితే, కోర్టు ఆక్షేపణ ఎయిడెడ్‌ పాఠశాలలకే పరిమితం కాదని, జూనియర్‌, డిగ్రీ కళాశాలల విషయంలోనూ వర్తిస్తుందని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం లెక్చరర్లను విలీనం చేసుకునే ప్రక్రియతో జూనియర్‌, డిగ్రీ కాలేజీలకు ఇచ్చే సాయం స్మార్ట్‌గా కోసేసింది.

భూవినియోగంలో ఎంత స్మార్టో!

ఎయిడెడ్‌ కళాశాలల విలీనంపై ప్రభుత్వం జీవోనం.42 జారీచేసింది. ఆగస్టులో జారీచేసిన ఈ జీవోలో...ప్రభుత్వంలో విలీనమైన విద్యాసంస్థల భూములను ప్రజా ప్రయోజనం కోసం విద్యాయేతర ప్రయోజనాలకు కూడా వాడుకోవచ్చని పేర్కొంది. విద్యకు సంబంధించిన అవసరాలకు సరిపడా వదిలేశాక...మిగిలిన వాటిని ఇతర ప్రయోజనాలకు వాడుకోవచ్చని పేర్కొంది. అంటే ప్రజా ప్రయోజనం పేరుచెప్పి వేలం వేసుకునే అంశాన్ని కూడా స్మార్ట్‌గా జీవోలో చొప్పించింది. అయితే ఇది కూడా విద్యాచట్టానికి వ్యతిరేకం. విద్యాచట్టం 1982 సెక్షన్‌ 47ప్రకారం...ఆయా ట్రస్టులను ఏ ఆశయంతో స్థాపించారో అందుకు మాత్రమే సదరు ఆస్తులు, స్థలాలను ఉపయోగించాలని స్పష్టంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు ఇష్టానుసారం మార్చేయకుండా, ఆస్తులను ఇష్టప్రకారం అమ్మేయకుండా విద్యాజ్యోతులు చిరకాలం వెలిగేలా చేసేందుకు చేసిన ఏర్పాటు ఇది. దీన్ని కూడా ప్రభుత్వం ఉల్లంఘించిందన్న విమర్శలు వస్తున్నాయి.

సాయం కోతలో మరీ స్మార్ట్‌..

ఎయిడెడ్‌ కళాశాలలకు ఇస్తున్న సాయం కోసేయాలంటే దానికి చట్టంలోనే కొన్ని షరతులు పెట్టారు. సెక్షన్‌ 46 ప్రకారం ఎయిడ్‌ ఆపేయాలంటే, ముందుగా నోటీసులివ్వాలి. కళాశాల యాజమాన్యాలు షరతులను ఉల్లంఘిస్తేనే సాయం నిలిపేయాలి. ఆ షరతుల్లో...గ్రాంట్‌ ఇచ్చేందుకు పెట్టిన నిబంధనల్లో దే న్నైనా ఉల్లంఘిస్తే, కులం పేరుతో ఎవరికైనా ప్రవేశం కల్పించకుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే, కళాశాలలో మతప్రచారం చేస్తే, రిజిస్టర్‌ నిర్వహణ-నిధుల వినియోగంలో దుర్వినియోగం చేస్తే, కళాశాలలో పనిచేసే సిబ్బంది విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తేనే సాయం నిలిపివేసేందుకు అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే విచారణ చేసి షరతుల ఉల్లంఘన జరిగితేనే సాయం కోయాలి. అంతే తప్ప ప్రభుత్వం ఇష్టానుసారం ఆ పనిచేయడానికి లేదు. కానీ దానికి విరుద్ధంగా జీవోనం.42ను ప్రభుత్వం తీసుకొచ్చింది. అధ్యాపకులను ప్రభుత్వంలో కలిపేస్తారా? కలపరా? అని నేరుగా అడిగింది. అంటే అధ్యాపకుల విలీనం ముసుగులో ఎయిడెడ్‌ కళాశాలలకు సాయం కోసేసిందన్నమాట. ఇప్పుడు ఎయిడెడ్‌ పాఠశాలల విషయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top