Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకున్న అమ్మోనియం నైట్రేట్

చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకున్న అమ్మోనియం నైట్రేట్

హైదరాబాద్: బీరుట్‌లో అమ్మోనియం నైట్రేట్ కారణంగా భారీ పేలుడు సంభవించడంతో భద్రతా చర్యల్లో భాగంగా చెన్నైలో నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్‌ను హైదరాబాద్‌కు తరలించారు. చెన్నై నుంచి 10 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ హైదరాబాద్‌కు చేరుకుంది. ఐదేళ్ల క్రితం దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ను చెన్నై సమీపంలోని మనలిలో ఉన్న టెర్మినల్ వద్ద 37 కంటైనర్లలో నిల్వ ఉంచారు. అయితే.. గతంలో చెన్నై వరదల సమయంలో 50 టన్నుల మేర అమ్మోనియం నైట్రేట్ నీటిలో, గాల్లో కలిసిపోయినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. బీరుట్‌లో జరిగిన భారీ పేలుడుతో చెన్నై కస్టమ్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడ 37 కంటైనర్లలో అమ్మోనియం నైట్రేట్ ఉండగా..

10 కంటైనర్లలోని 181 టన్నుల రసాయన మిశ్రమాన్ని హైదరాబాద్ తరలించారు.

భాగ్యనగరానికి చెందిన ఓ సంస్థ ఈ అమ్మోనియం నైట్రేట్‌ను కొనుగోలు చేసింది. కీసర మండలం అంకిరెడ్డిపల్లెకు కంటైనర్స్ చేరుకున్నాయి. ఇక్కడే నిల్వ చేసి అమ్మోనియం నైట్రేట్‌ను రీప్రాసెస్ చేయనున్నారు. రీప్రాసెస్ తర్వాత సింగరేణి, కోల్ ఇండియా, నీటిపారుదల ప్రాజెక్టులకు సరఫరా చేయనున్నారు. ఈ రీప్రాసెసింగ్ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి కానున్నట్లు తెలిసింది. మరికొన్ని రోజుల్లో మరో 20 కంటైనర్ల అమ్మోనియం నైట్రేట్‌ను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు. అయితే.. బీరుట్‌లో పేలుడుకు కారణమైన రసాయనాన్ని తమ ప్రాంతంలో నిల్వ చేయడంపై కీసర వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy