Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'చిచ్చా' నోట యువరాజు పట్టాభిషేకం మాట

'చిచ్చా' నోట యువరాజు పట్టాభిషేకం మాట

చిరునవ్వులు చిందించిన మంత్రి కేటీఆర్‌

కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలు: పద్మారావు గౌడ్‌

హైదరాబాద్‌(సికింద్రాబాద్‌/చిలకలగూడ), జనవరి 21(ఆంధ్రజ్యోతి): యువరాజు పట్టాభిషేకంపై తాజాగా టీఆర్‌ఎ్‌సకు చెందిన మరో ప్రజా ప్రతినిధి గొంతు విప్పారు. కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలంటూ అభినందనలు తెలిపారు. అయితే యువరాజు సమక్షంలోనే ఈ ఘటన జరగడం, ఆ మాటలకు ఆయన చిరునవ్వులు చిందించడంతో గులాబీ శ్రేణుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి యువమంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీఎం పగ్గాలు అందుకోనున్నారని, పట్టాభిషేకానికి నిర్ణయం జరిగిపోయిందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే.

దీనిపై ఒకరిద్దరు మంత్రులు కూడా పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే తాజాగా గురువారం ఇదే అంశంపై డిప్యూటీ స్పీకర్‌ టి.పద్మారావుగౌడ్‌ సాక్షాత్తు మంత్రి కేటీఆర్‌ సమక్షంలోనే వ్యాఖ్య చేయడం ఆసక్తి రేకెత్తించింది. సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం ఎదుట దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ డివిజనల్‌ ఆఫీసర్స్‌ బ్రాంచి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇది చోటుచేసుకుంది. 'గౌరవనీయులు, మా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, బహుశా.. అతి త్వరలోనే కాబోయే ముఖ్యమంత్రి గారికి మా శాసనసభ (నియోజకవర్గం) తరఫున, మా అందరి తరఫున, మా రైల్వే కార్మికులందరి తరఫున కంగ్రాట్స్‌ తెలుపుతునా' అంటూ పద్మారావుగౌడ్‌ వ్యాఖ్యానించారు.

దీనిని కేటీఆర్‌ పట్టించుకున్నారో, లేదో అనిపించి, 'నీకు రామారావు..' అంటూ మళ్లీ కంగ్రాట్స్‌ చెప్పారు. అంతేకాదు.. 'మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా రైల్వే కార్మికులకు ఏ ఇబ్బందీ కలగకుండా కాపాడతారని ఆశిస్తున్నాను' అని కూడా అన్నారు. పజ్జన్న మాటలకు అక్కడున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైల్వే కార్మిక నేతలు, ఇతరులంతా కరతాళ ధ్వనులు చేస్తూ కేరింతలు కొట్టారు. అనంతరం వేదిక నుంచి దిగిన తర్వాత కేటీఆర్‌-పద్మారావు నడుచుకుంటూ వెళ్లడం అందరూ ఆసక్తిగా చూశారు. 'ఏం చిచ్చా.. అలా అనేశావ్‌!' అంటూ పద్మారావుతో మంత్రి కేటీఆర్‌ అన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy