Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్న కారుకు మళ్లీ ఆదరణ

చిన్న కారుకు మళ్లీ ఆదరణ

  • గ్రామీణ మార్కెట్‌, తొలిసారి కారు కొనుగోలుదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌

దేశీయ కార్ల మార్కెట్లో ఈ ఏడాది స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. గడిచిన దశాబ్దకాలంలో తమ ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతూ వచ్చిన చిన్న కార్లకు మార్కెట్లో మళ్లీ ఆదరణ పెరుగుతోంది.

ముఖ్యంగా గ్రామీణ మార్కెట్లో, తొలిసారి కారు కొనుగోలుదారుల నుంచి వీటికి డిమాండ్‌ క్రమంగా పుంజుకుంటోంది. మే నెలలో మారుతి సుజుకీ చిన్న కార్లయిన ఆల్టో విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 90 శాతం, ఎస్‌-ప్రెస్సో అమ్మకాలు 254 శాతం, సెలెరియో సేల్స్‌ 62 శాతం వృద్ధి చెందడమే ఇందుకు నిదర్శనం. అంతేకాదు, ప్రస్తుతం వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న అన్ని మోడళ్ల కార్ల సంఖ్య 2 లక్షల యూనిట్ల స్థాయిలో ఉండగా.. అందులో చిన్న కార్ల వాటా 30,000 యూనిట్ల పైమాటే. చిన్న, హ్యాచ్‌బ్యాక్‌ విభాగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు ఈ మోడళ్ల పునరుద్ధరణలోనూ మారుతి సుజుకీ, టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ (టీఎంపీవీ) ముందంజలో ఉన్నాయి. మిగతా కంపెనీలూ ఈ విభాగంపై మళ్లీ దృష్టి పెట్టాయి.

చిన్న కార్ల గిరాకీకి దోహదపడుతున్న అంశాలు

  • ప్రీమియమైజేషన్‌తో పాటు కార్ల ధరలు ఏటేటా పెరుగుతూ రావడంతో ఎస్‌యూవీ మోడళ్లు మధ్యతరగతికి అందుబాటులో లేకుండా పోయాయి. ఇందుకు తోడు చిన్న కార్లతో పోలిస్తే ఎస్‌యూవీల ధరతో పాటు వాటి నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. ఇంధన రేట్లు కూడా పెరిగిన నేపథ్యంలో మధ్యతరగతి కస్టమర్లు, ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల వాహనానికి అప్‌గ్రేడ్‌ కావాలనుకునేవారు చిన్న కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుబాటు ధర, అధిక మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలు ఇందుకు కారణం.

  • గత ఏడాది కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై జీఎ్‌సటీని గణనీయంగా తగ్గించడం గిరాకీ, బుకింగ్స్‌ పెరుగుదలకు తోడ్పడ్డాయి.

జీఎస్టీ తగ్గింపుతో జోష్‌

గత ఏడాది సెప్టెంబరులో జీఎ్‌సటీ తగ్గింపుతో కార్ల విక్రయాలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూలతల నేపథ్యంలోనూ కార్ల కంపెనీలు బంపర్‌ విక్రయాలను నమోదు చేయగలుగుతున్నాయి. అయితే, భవిష్యత్‌లోనూ ఈ విక్రయాల జోరును కొనసాగించాలంటే, గడిచిన కొన్నేళ్లలో విస్మరించిన మధ్య తరగతి కస్టమర్లను తిరిగి ఆకర్షించడం తప్పనిసరని కార్ల కంపెనీలు గుర్తించాయి. అందుకే స్మాల్‌, హ్యాచ్‌బ్యాక్‌ మోడళ్లపై మళ్లీ ఫోకస్‌ పెంచాయి.

కొనసాగనున్న ఎస్‌యూవీల హవా

అధిక మార్జిన్ల ఆశతో పాటు యువ కస్టమర్లను ఆకర్షించేందుకు కార్ల కంపెనీలు గడిచిన కొన్నేళ్లుగా స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ (ఎ్‌సయూవీ), మల్టీ పర్పస్‌ వెహికిల్‌ (ఎంపీవీ) మోడళ్లను అధికంగా ప్రోత్సహిస్తూ వచ్చాయి. వాటి ఆధునిక హంగులు, అత్యాధునిక ఫీచర్ల ముందు చిన్న కారు వెలవెల బోయింది. కస్టమర్ల అభిరుచులు, ప్రాధాన్యాలు మారడంతో ఎస్‌యూవీల విక్రయాలు వేగంగా పెరుగుతూ రాగా.. స్మాల్‌, హ్యాచ్‌బ్యాక్‌ కార్ల అమ్మకాలు కుంటుపడ్డాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కార్ల మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌ విక్రయాల వాటా 46 శాతంగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం నాటికి 23 శాతానికి పడిపోయింది.

గడిచిన దశాబ్దకాలంలో ఎస్‌యూవీల విక్రయాల వాటా వేగంగా పెరుగుతూ వచ్చి ప్రస్తుతం 55 శాతానికి చేరుకుంది. ఎస్‌యూవీలు, ఎంపీవీల మొత్తం వాటా 68 శాతంగా నమోదైంది. మున్ముందూ వీటి హవా కొనసాగనుందని.. చిన్న, హ్యాచ్‌బ్యాక్‌ కార్లకు మళ్లీ గిరాకీ పెరుగుతున్నప్పటికీ, ఈ విభాగానికి పూర్వ వైభవం కష్టమేనని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy