Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చీరలతో ముగ్గు...నగలతో పెయింటింగ్‌...

చీరలతో ముగ్గు...నగలతో పెయింటింగ్‌...

పండగొస్తే రంగులతో ముగ్గులేస్తారు. కానీ ఈయన మాత్రం చీరలతో ముగ్గును అలంకరిస్తాడు. అంతేనా... చేతికి ఏది దొరికితే దానితోనే ఒక అందమైన ఆకృతినో, సెలబ్రిటీల బొమ్మలనో పేరుస్తాడు.

పూలు, నగలు, చీరలు, వంట సామాను... అన్నీ కూడా అతడి చిత్రాలకు జీవం పోసే రంగులే. 'నా జీవితం కళకే అంకితమం'టూ అందంగా సాగిపోతున్న అరుదైన కళాకారుడి జీవన ప్రయాణమిది...

ముగ్గు.. చీర.. ఈ రెండింటితో ఆడవాళ్లకి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. వీటిని కలిపి ఓ అద్భుతాన్ని ఆవిష్కృతం చేశాడు డావిన్సీ సురేష్‌. ఇటీవల కొచ్చిలో చీరలతో చేసిన (వేసిన) ముగ్గు వల్ల ఈ విశిష్ట కళాకారుడి గురించిన చర్చ సర్వత్రా జరుగుతోంది. కేరళలో ముఖ్యమైన పండగ ఓనం. పండగ సందర్భంగా ఎవరైనా సరే తమ లోగిళ్లలో రంగులు, పువ్వులతో అందమైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. అయితే సురేష్‌ మాత్రం 2500 పట్టు చీరలను ఎంచుకున్నాడు. వాటితో అందమైన స్త్రీ రూపాన్ని ముగ్గులా చిత్రీకరించాడు. దీనికోసం అతడు 18 గంటల పాటు శ్రమించాడు. ప్రపంచంలోనే ఈ తరహా చీరల ముగ్గు ఇప్పటిదాకా ఎవరూ వేయలేదంటున్నారు. అదో రికార్డు.

 కళాకారుల కుటుంబం...

డావిన్సీ సురేష్‌ అసలు పేరు పి.కె.సురేష్‌. పుట్టింది, పెరిగింది కేరళలోని త్రిస్సూర్‌లో. పదకొండు మంది సంతానంలో సురేష్‌ పదవవాడు. మధ్యతరగతి కుటుంబం. అటు అన్నలు, అక్కలు.. ఇల్లంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. సురేష్‌ అన్నల్లో ఒకతను ఆర్టిస్ట్‌. ఆయన నుంచే తనకు పెయింటింగ్‌ మీద ఆసక్తి కలిగింది. అంతేగాక... అతడి కజిన్స్‌ కూడా ఆర్టిస్టులే కావడంతో అందరూ కలిసి డావిన్సీ అనే గ్రూప్‌ ప్రారంభించారు. కారణం... అందరికీ అంతర్జాతీయ పెయింటర్‌ లియోనార్డో డావిన్సీ అంటే అభిమానం కాస్త ఎక్కువే. ఆ ఇష్టంతోనే.. గ్రూప్‌నకే కాదు, తన పేరుకు ముందు కూడా డావిన్సీ చేర్చు కున్నాడు సురేష్‌. ఇరవై ఏళ్లకు పైగా ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాడు. ఫ్లెక్సీ బోర్డులు, బ్యానర్లను రాయడంలో సురేష్‌ పనితనం కేరళ అంతటికీ తెలుసు.

 అన్నీ అద్భుతాలే...

సోషల్‌ మీడియాను అనుసరించేవారికి సురేష్‌ కళ ఎక్కడో చోట పరిచయం అయ్యే ఉంటుంది. రంగుల చెక్కలతో పృథ్వీరాజ్‌, బొప్పాయితో శశి కలింగ, వంట సామానులతో మోహన్‌లాల్‌ చిత్రాలను రూపొందించాడు. అంతేనా... తన అభిమాన నటుడు మోహన్‌లాల్‌ 65వ పుట్టినరోజు సందర్భంగా కేవలం పనసకాయ గింజలు, పొట్టుతో ఆయన బొమ్మను అద్భుతంగా ఆవిష్కరించాడు. అలాగే బంగారు నగలతో అబ్దుల్‌ కలామ్‌, ఒక టన్ను పూలతో శ్రీ నారాయణ గురు బొమ్మను రూపొందించాడు.

 కాఫీ బీన్స్‌తో కళాభవన్‌ మణి, బాదం, జీడిపప్పుతో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లను తీర్చిదిద్దాడు. బిస్కెట్లు, ఇతర బేకరీ ఐటమ్స్‌తో సురేష్‌ తయారుచేసిన మలబార్‌ ప్రాంతానికి చెందిన సంప్రదాయ నృత్య కళారూపమైన 'తయ్యం' 24 అడుగుల భారీ ప్రతిరూపానికి అనేక ప్రశంసలను అందుకున్నాడు. 3డీ పెయింటింగ్స్‌, నీళ్లల్లో, మంట, క్యాండిల్‌ పొగతో, వంటింటి సామాన్లతో, బట్టలతో, పుస్తకాలతో.. ఇలా చెబుతూ పోతే చాలా మాధ్యమాల్లో సురేష్‌ చెక్కిన అద్భుతాలు లెక్కలేనన్ని ఉన్నాయి. మరిన్ని కొత్త మాధ్యమాలతో తన కళను మెరుగుపర్చుకోవాలని కలలు కంటున్నాడు.

 నటుడు, దర్శకుడు కూడా...

పెయింటింగ్స్‌తోనే కాదు... ఇంకేదైనా కొత్తగా చేయాలనే తాపత్రయం సురేష్‌లో ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆసక్తితోనే.. శిల్పాలను, సైకత శిల్పాలను తయారుచేయడం నేర్చుకున్నాడు. కరోనా సమయంలో కూడా 100 పెయింటింగ్స్‌, అవేర్‌నెస్‌ శిల్పాలను రూపొందించాడు. కరోనా అవేర్‌నెస్‌లో భాగంగా రెండు షార్ట్‌ ఫిల్మ్స్‌ కూడా తీసి శభాష్‌ అనిపించుకున్నాడు. ఈ క్రమంలోనే అతడికి నటన మీద ఆసక్తి మొదలైంది. కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లోనూ నటించాడు. ఆ అనుభవంతో నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అతడి ప్రతిభ అక్కడితో ఆగిపోలేదు. 20 పాటలకు సాహిత్యాన్ని కూడా అందించాడు. సృజనాత్మకతకు హద్దులు లేవని నిరూపిస్తూ, అనేక కళల్లో దూసుకుపోతూ, సరికొత్త రికార్డులతో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సూపర్‌ సురేష్‌ అనిపించుకుంటున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy