ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని ఓ పాఠశాలలో మొబైల్ ఫోన్లకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమం వివాదంగా మారింది. పిల్లలను మొబైల్ ఫోన్లు, ఎక్కువసేపు స్క్రీన్ చూడటం నుంచి దూరంగా ఉంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.
అయితే ఇందులో కొందరు పిల్లలు భయంతో ఏడుస్తూ, కేకలు వేయడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని ఖతీమా బిరియా మఝోలా ప్రాంతంలోని ఆదర్శ్ ఇండియా మాంటిస్సోరి పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు విద్యార్థుల కళ్లకు కట్టు కట్టి, కళ్ల చుట్టూ ఎర్రటి ద్రవాన్ని పూసి గాయపడినట్లు చూపించినట్లు తెలుస్తోంది. వారిలో ఓ విద్యార్థి మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా వాడటం వల్ల వైద్యులు తన రెండు కళ్లను తొలగించారని తోటి విద్యార్థులకు చెప్పినట్లు సమాచారం. దీంతో మిగతా పిల్లలు భయంతో ఏడుస్తూ, కేకలు వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో కొందరు చిన్నారులు ఇకపై మొబైల్ ఫోన్లు ఉపయోగించబోమని చెబుతున్నట్లు కనిపించింది.
పిల్లలు ఎక్కువసేపు గేమింగ్, సోషల్ మీడియా ఉపయోగించడం వల్ల కలిగే సమస్యలను వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సమాచారం. అయితే పిల్లలను భయపెట్టేలా కార్యక్రమం నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దృష్టి సారించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.
ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి హరేంద్ర కుమార్ మిశ్రా ఈ ఘటనపై విచారణ జరిపి, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రాథమిక విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఖతీమా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ తుషార్ సైనీ కూడా పిల్లలను భయపెట్టేలా కార్యక్రమాలు నిర్వహించకూడదని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. దర్యాప్తు నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

