Tuesday, 16 Jul, 1.02 am ఆంధ్రజ్యోతి

చిత్రజ్యోతి
'దాసి'... 'మల్లేశం'... నా అదృష్టం!

''వాణిజ్య హంగులతో సంబంధం లేకుండా ప్రేక్షకులు హృదయాల్లో కలకాలం నిలిచే చిత్రాలు, ప్రతిభకు కొలమానంగా నిలిచే మంచి చిత్రాలు కొన్ని వస్తాయి. ఉదాహరణకు... 30 ఏళ్ల క్రితం నేను నటించిన 'దాసి'. ఇప్పటికీ ఆ చిత్రం గురించి మాట్లాడతారు. దానికి ఐదు జాతీయ పురస్కారాలు వచ్చాయి. నా అదృష్టం కొద్దీ మరో 60 ఏళ్లు మాట్లాడుకునే 'మల్లేశం'లో నటించే అవకాశం వచ్చింది. ఇదీ చరిత్రలో నిలిచే చిత్రం. దీంతో నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది'' అని చక్రపాణి ఆనంద అన్నారు. చేనేత కార్మికుల వెతలు తీర్చిన ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం 'మల్లేశం'. ఇందులో ఆయన మల్లేశం తండ్రి పాత్రలో నటించారు. తన పాత్రకు, చిత్రానికి ప్రశంసలు వస్తున్న నేపథ్యంలో చక్రపాణి ఆనంద చెప్పిన సంగతులు...

  • దర్శకుడు రాజ్‌ రాచకొండ చిత్రీకరణ ప్రారంభానికి నెల ముందే ఆర్టిస్టులందరికీ స్ర్కిప్ట్‌ ఇచ్చారు. ఒకటికి పదిసార్లు చదివా. దీనివల్ల, పాత్రలను అర్థం చేసుకునే వీలు చిక్కింది. ఆర్టిస్టుల మధ్య కో-ఆర్డినేషన్‌ కుదిరింది. అలాగే, దర్శకుడు స్వేచ్ఛ ఇవ్వడంతో అందరూ అద్భుతంగా నటించారు.
  • 'దాసి', 'మల్లేశం' వంటి చిత్రాలు తీయడం ఓ యజ్ఞంతో సమానం. కథపై ఎంతో పరిశోధన చేసి తెరకెక్కిస్తారు. స్ర్కిప్ట్‌ పర్‌ఫెక్ట్‌గా వచ్చే వరకూ రాస్తారు. పాత్ర తాలూకూ స్వభావాన్ని లోతుగా చూపిస్తారు. ప్రతి పాత్రకూ ఓ ప్రాముఖ్యత ఉంటుంది. నటీనటులకు తమ ప్రతిభను చూపించే అవకాశం దక్కుతుంది. నటుడిగా పేరు వస్తుంది. 'మల్లేశం'తో నాకు అలాంటి అవకాశం, పేరు వచ్చాయి.
  • కేటీఆర్‌గారు 'మీకు, పాత్రకు పోలికల్లేవు. సహజంగా చేశారు' అన్నారు. మల్లేశంగారు 'ఎంత బాగా చేసిండ్రు అన్నా! మా నాయన గుర్తొచ్చిండు. తిట్టినవన్నీ గుర్తొచ్చాయి. నేను ఏడ్చిన' అని కంటతడి పెట్టుకున్నారు. అంతకుమించిన ప్రశంస ఏముంటుంది? ప్రేక్షకులు గుమ్మడి, ఎస్వీఆర్‌ గుర్తొచ్చారని చెప్పారు. సురేశ్‌బాబు, నందినీరెడ్డి, యశ్‌ రంగినేని... ఇలా ఎంతోమంది ప్రశంసించారు. కాన్‌, బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి జ్యూరీ మెంబర్‌గా పనిచేసిన మీనాక్షీ షబ్బే 'పతాక సన్నివేశాల్లో మీ నటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నా. కంటతడి పెట్టుకోని ప్రేక్షకుడు ఉండడేమో' అన్నారు.
  • ఇప్పుడు చిత్ర పరిశ్రమలోకి కొత్త నీరు వస్తోంది. విదేశాల్లో ఫిల్మ్‌ స్కూల్స్‌లో చదువుకున్న యువ దర్శకులు మూస కథలతో కమర్షియల్‌ ఫార్ములా చిత్రాలు కాకుండా ఉన్నతమైన కథలతో గొప్ప చిత్రాలు తీస్తున్నారు. ఇంతకుముందు మలయాళ, తమిళ, మరాఠీ బెంగాలీ భాషల్లో అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయి. మన దగ్గర ఎందుకు రావడం లేదని అనుకునేవాళ్లం. ఇప్పుడు మన దగ్గరా వస్తున్నాయి. ఇదొక గ్రేట్‌ రెవల్యూషన్‌. గొప్ప మార్పు కనిపిస్తోంది. మంచి కథలు వస్తే... మంచి క్యారెక్టర్లు పుడతాయి. మంచి క్యారెక్టర్లు వస్తే... మంచి నటులకు అవకాశం వస్తుంది. తెలుగు నటులకు గుర్తింపు, గౌరవం వస్తాయి.
  • తెలంగాణ సంస్కృతి అద్భుతమైన సంస్కృతి. ఇన్నాళ్లు సినిమాకు, తెలంగాణకు సంబంధం లేదు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు... ఏ శాఖలో చూసినా తెలంగాణకు తక్కువ ప్రాతినిథ్యం ఉండేది. ఇప్పుడు ఆ ప్రాతినిథ్యం పెరిగింది.
    తెలంగాణ యువకులు వస్తున్నారు. వాళ్లలో ఫైర్‌ ఉంది. తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, కథలను తెరపైకి తీసుకొస్తున్నారు. రాయలసీమ వాళ్లను ఫ్యాక్షనిస్టులుగా చూపించినట్టు... ఇంతకు ముందు సినిమాల్లో కామెడీ పాత్రలకు, రౌడీలకు తెలంగాణ నేపథ్యాన్ని వాడుకున్నారు. రాంగ్‌ యాంగిల్‌లో ప్రజెంట్‌ చేస్తూ వచ్చారు. తెలంగాణలో బోల్డంత మంది అమరులు, వీరులు ఉన్నారు. తెలంగాణలో ఎంతో చరిత్ర, సంస్కృతి, పోరాటాలు, వ్యధలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఉన్నాయి. వాటిని, ఈ మట్టిలో కథలను యువ దర్శకులు బయటకు తీసుకొస్తున్నారు. దీని వల్ల మనుషుల్లో పరివర్తన వస్తుంది. అందువల్ల, అద్భుతమైన కథలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తెలంగాణ యాస, భాషలను ఇష్టపడుతున్నారు.
  • 'దాసి' చేసినప్పుడు నా వయసు 20 ఏళ్లు. నేనిక్కడ... ఇండస్ట్రీ మద్రాస్‌లో ఉండటంతో అవకాశాలొచ్చినా అందిపుచ్చుకునే పరిస్థితిలో నేను లేను. ఇప్పుడు నాకు 50 ఏళ్లు. ఈ 30 ఏళ్లలో జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. రకరకాల జీవితాలను చూశా. మనుషులను పరిశీలించా. దాంతో నాలో పరిణితి వచ్చింది. ఇన్నాళ్ల నా అనుభవం పాత్రకు అక్కరకు వచ్చింది. నటనలో కనిపించింది. క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో కెఎస్‌ రామారావుగారు నిర్మిస్తున్న చిత్రంలో హీరో విజయ్‌ దేవరకొండ తండ్రి పాత్రలో నటించా. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి నటిస్తున్న 'విరాట పర్వం'లో కీలక పాత్ర చేస్తున్నా. మరో నాలుగైదు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top