Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

ఇంటర్నెట్ డెస్క్: డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయడం, కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం కూడా అంతే ముఖ్యం.

అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఇతరులను ఆకట్టుకోవడం కోసం, సమాజంలో తమ హోదాను చూపించుకోవడం కోసం లేదా ఆఫర్లు, డిస్కౌంట్లకు ఆకర్షితులై అవసరం లేని వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లు క్రమంగా ఆర్థిక భారాన్ని పెంచవచ్చు.

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో సంపదను ఎలా ఉపయోగించాలి, ఎలాంటి ఖర్చులకు దూరంగా ఉండాలి అనే విషయాలపై పలు సూచనలు చేశారు. ఆ ఆలోచనలను నేటి కాలానికి అన్వయించుకుంటే.. మన ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు చేయకుండా, అవసరమైన వాటికే డబ్బు వినియోగించడం మంచిదనే సందేశం కనిపిస్తుంది.

ఇతరులకు చూపించుకోవడానికి ఖర్చు చేయడం

కొంతమంది తమ హోదాను చూపించుకోవడానికి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. కొత్త మొబైల్, ఖరీదైన దుస్తులు, బ్రాండెడ్ వస్తువులు, విలాసవంతమైన వస్తువులను కేవలం ఇతరులను ఆకట్టుకోవడం కోసం కొనడం వల్ల పొదుపు తగ్గిపోవచ్చు. మన దగ్గర ఎంత ఖరీదైన వస్తువులు ఉన్నాయన్నది కంటే.. అవసరమైన సమయంలో మన చేతిలో డబ్బు ఉండటం ముఖ్యమని చాణక్య నీతి సూచిస్తుంది. అందుకే ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన కంటే మన ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఖర్చు చేయడం మంచిది.

మెప్పించడానికి డబ్బు ఖర్చు చేయడం

మనలను నిజంగా గౌరవించని లేదా అవసరమైన సమయంలో మనకు అండగా నిలవని వ్యక్తులను మెప్పించేందుకు పదేపదే డబ్బు ఖర్చు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. సంబంధాల్లో ప్రేమ, ఆప్యాయత ముఖ్యమే. అయితే కేవలం ప్రశంసలు పొందడం కోసం లేదా ఎవరినైనా సంతోషపెట్టడం కోసం అవసరానికి మించి ఖర్చు చేయడం మాత్రం మంచిది కాదు. ఆ డబ్బును మన అవసరాలకు, పొదుపుకు లేదా భవిష్యత్తు లక్ష్యాలకు ఉపయోగించుకోవచ్చు.

'ఇతరులు ఏమనుకుంటారు?' అని ఆలోచించి ఖర్చు చేయడం

సమాజంలో తమ గౌరవం తగ్గకూడదనే ఉద్దేశంతో కొంతమంది తమ స్థోమతకు మించి ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకల్లో అప్పులు చేసి మరీ భారీగా ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తుంటాయి. కానీ ఇతరుల అభిప్రాయం కోసం మన భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టడం సరైనది కాదు. కార్యక్రమాలు ఎంత ముఖ్యమైనవైనా.. మన ఆదాయం, పొదుపు, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయడం మంచిది.

క్షణికమైన ప్రశంసల కోసం ఖర్చు చేయడం

డబ్బు ఖర్చు చేస్తేనే ఇతరులు మనల్ని గొప్పగా భావిస్తారని కొందరు అనుకుంటారు. దీంతో ఖరీదైన బహుమతులు ఇవ్వడం, అవసరం లేకపోయినా పార్టీలు ఏర్పాటు చేయడం లేదా ఇతరులను ఆకట్టుకోవడానికి భారీగా ఖర్చు చేయడం చేస్తుంటారు. ఇలాంటి ఖర్చులు కొంతసేపు ఆనందాన్ని ఇవ్వొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఆర్థిక ప్రయోజనం ఉండకపోవచ్చు. ఒక వ్యక్తికి నిజమైన గౌరవం అతను ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నాడనే దానిపై మాత్రమే ఆధారపడదు. అతని వ్యక్తిత్వం, ప్రవర్తన, సామర్థ్యం, ఇతరులతో వ్యవహరించే తీరు కూడా గౌరవాన్ని తీసుకొస్తాయి.

పిల్లలతో బీచ్ వెకేషన్‌కు ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రాంతాలే బెస్ట్!

స్నానానికి సబ్బు మంచిదా? బాడీ వాష్ మంచిదా? ఈ విషయాలు తెలుసుకోండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy