అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదు
విషప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ''దళితులు, గిరిజనుల భూములను లాక్కోవడం ప్రజా ప్రభుత్వ విధానం కాదు.
వారి అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దళితుల భూములకు సంపూర్ణ రక్షణగా నిలుస్తుంది. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విషప్రచారాన్ని నమ్మొద్దు. రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలి'' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. భూములకు సంబంధించిన రికార్డుల పరిశీలన, సర్వేలు, భూ సమస్యల పరిష్కారం వంటి ప్రక్రియలను ప్రజల భూములను లాక్కోవడానికి చేస్తున్న చర్యలుగా చూడటం సరికాదని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
భూ సంస్కరణలు, భూ పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా భూమిలేని దళితులకు భూములు ఇచ్చి వాటిపై హక్కు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉందన్నారు. అధికారంలోకి వస్తే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించారని విమర్శించారు. రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులకు, గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల ప్రాంతంలోని 15 రెవెన్యూ గ్రామాల్లో, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం చూపించామని ఆయన తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:

