Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

మార్కాపురం, జూన్ 6: కనిగిరిలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ..

అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు రావడం సంతోషంగా ఉందన్నారు. కనిగిరి ప్రజలందరూ కలిసి అంబేద్కర్ విగ్రహం పెట్టడం అభినందనీయమని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని సూచించారు. దేశంలో చాలా పార్టీలు అంబేద్కర్ పేరు వాడుకుంటున్నాయని.. కానీ అంబేద్కర్ ఆశయాలను అనుసరించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ ఫొటో జేబులో పెట్టుకుంటున్నారు కానీ.. ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. 'నా తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్.. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పని చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అంబేద్కర్ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు' అని చెప్పారు.

గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగలేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఏ దళితుడికీ అన్యాయం జరగకుండా ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని కేంద్ర మంత్రి అన్నారు. దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఏపీలో మహిళల రక్షణకు సీఎం చంద్రబాబు, హోం మినిస్టర్ అనిత ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, మంత్రి బాలవీరాంజనేయ స్వామి, కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంఎస్ రాజు, బీఎన్ విజయ్ కుమార్, కందుల నారాయణరెడ్డి, అశోక్ రెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ, ఒడా చైర్మన్ రియాజ్ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy