చింతకాని మార్చి7: ప్రస్తుత రాజకీయపరిస్థితుల్లో దేశంలో ప్రత్యామ్నాయశక్తి కమ్యూనిస్టులేనని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఎర్రజెండాకే ఉందని సీపీఐ రాష్ట్ర నాయకుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పలు కుటుంబాలు కూనంనేని సమక్షంలో సీపీఐలో చేరాయి. సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయ, కార్మిక వర్గాలను టీఆర్‌ఎస్ పార్టీ మోసం చేసిం దన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కలగానే మిగిలిపోయిందని, ఉద్యోగ భృతి కరువైందన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు.ప్రజా సమస్యలపైన పోరాడే కమ్యూనిస్టులతో ప్రజలు కలసిరావాలని కోరారు.

